‘అమ్మ’ శకం ముగిసినట్టేనా..?

Sunday, September 28th, 2014, 11:35:59 AM IST

సంక్షేమ పథకాల స్కీములతో జనం చేత అమ్మ.. అని పిలిపించుకుంటున్న ఏఐడీఎంకే అధినేత్రి.. పురిచ్చితలైవి.. జయలలిత ఇప్పుడు జైలు పాలు అయ్యారు. అంతేకాదు వంద కోట్ల రూపాయల జరిమానా కూడా కట్టాలి..! సీఎం పదవీని కూడా వదులుకున్నారు. అంతేకాదు ప్రజా ప్రతినిధ్య చట్టం ప్రకారం తీర్పు వెలువడిన వెంటనే ఆమె తన ఎమ్మెల్యే పదవికి సైతం అనర్హురాలు అయ్యారు. ఈ కేసులో ఆమెతోపాటు శశికళ, ఇళవరిసి, సుధాకరన్ లను కూడా కోర్టు దోషులుగా తేల్చింది. వీరందరికి కూడా నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. అంతేకాదు జయలలితకు వంద కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది. మిగిలిన ముగ్గురు దోషులు ఒక్కొక్కరికి పది కోట్ల రూపాయల చొప్పున జరిమానా విధించింది.

1995లో జయ దత్త పుత్రుడు సుధాకరన్ వివాహానికి అయిన ఖర్చు.. అసలీ కేసుకు నాంది అని చెప్పాలి. బంగారు పూత వెడ్డింగ్ కార్డులు.. 75 వేల చదరపు అడుగుల్లో వివాహ వేదిక, రెండున్నర లక్షల మందికి భోజనాలు, వేలాది మంది కార్యకర్తలకు, వివిఐపిలకు ఖరీదైన బహుమానాలు అన్నీ వివాదాస్పదంగా నిలిచాయి. జయ ఆస్తుల లెక్కలపై ప్రత్యర్థులు దృష్టి సారించేలా చేశాయి. ఈ వివాహంతోనే జయ ఆస్తుల చిట్టా ప్రపంచానికి తెలిసొచ్చింది. ఈ వందకోట్ల పెళ్లి చరిత్రలో నిలిచిపోయింది.

1992లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కు చెందిన భూమిని జయ టీవికి కారు చౌకగా జయలలిత ఇప్పించారు. మార్కెట్ ధర కంటే యాభై శాతం తక్కువగా భూమిని కట్టబెట్టిన ఈ వ్యవహారాన్ని ఐఎఎస్ అధికారులు వ్యతిరేకించినా జయ వెనక్కి తగ్గలేదు. రెండు అగ్రిమెంట్లపై ఆమె దగ్గరుండి సంతకాలు చేశారు. దీని వల్ల జయ టీవీ ఛానల్ కూ మూడున్నర కోట్ల లబ్ధి చేకూరింనేది తమిళనాడు విజిలెన్స్ శాఖ వారి వాదన. ఈ కేసు కారణంగానే 2001లో జయపై అనర్హత వేటు పడింది. అయినా రాజ్యాంగంలోని లొసుగును ఆసరా చేసుకుని ఆమె 2002లోనే మళ్లీ సిఎం పీఠాన్ని అధిష్టించారు.

గ్రానైట్ లైసెన్సుల మంజూరు వ్యవహారంలోనూ జయలలిత అడ్డగోలుగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక, న్యాయ శాఖలతో నిమిత్తం లేకుండా… తొమ్మిది సంస్థలకు గ్రానైట్ తవ్వకాల లైసెన్సులు ఇచ్చేశారు. టెండర్లు లేకుండా వీళ్లందరినీ ఆమె నామినేట్ చేయడం తీవ్ర వివాదమైంది. ఈ గ్రానైట్ స్కామ్ విలువ అప్పట్లోనే 12 కోట్లు.

మారుమూల గ్రామ పంచాయతీలకు కలర్ టీవీ సెట్ల పంపకం కూడా తీవ్ర వివాదమైంది. మొత్తం 197 సంస్థల నుంచి కొటేషన్లు తెప్పించిన జయలలిత…. వాటినుంచి ఆరింటిని ఎంపిక చేశారు. ఈ కుంభకోణంలో పది కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.

తమిళనాడు PWD శాఖ వద్దని వారించినా.. ఇండోనేషియా నుంచి నాసిరకం బొగ్గును దిగుమతి చేసుకునేందుకు జయ అనుమతినిచ్చారు. ఇందుకోసం టెండర్ డాక్యుమెంట్లను కూడా ఆమె ఫోర్జరీ చేసినట్టు అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ టెండర్లను దక్కించుకున్న సంస్థ ఓనర్.. శశికళకు బాగా కావాల్సిన వ్యక్తని.. అందుకే జయలలిత ఇంత సాహసానికి ఒడిగడ్డారని సమాచారం. ఈ నాసి రకం బొగ్గు దిగుమతి స్కామ్ విలువ అక్షరాలా ఆరున్నర కోట్లు.

ఇలా అనేక స్కాములతో పాలన సాగించిన జయలలిత ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ… జనతా పార్టీ అధినేత… ప్రస్తుతం బీజేపీ నేత అయిన సుబ్రమణ్య స్వామి 1996లో కేసు నమోదు చేశారు. 1997లో అధికార పగ్గాలు చేపట్టిన డిఎంకె పార్టీ… జయపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఆ తర్వాత సుదీర్ఘంగా సాగిన ఈ కేసులో బెంగళూరులోని స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది. అక్రమాస్తుల కేసులో జయను నిర్దేషిగా తేల్చిన కోర్టు… నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.

ఇక తాజా పరిణామాల నేపథ్యంలో జయలలిత రాజకీయ భవిష్యత్ ఇక కనుమరుగు అయినట్టేనని తెలుస్తోంది. నాలుగేళ్ళ జైలు శిక్ష పడిన దరిమిలా, ఆమె రాజకీయ జీవితం దాదాపు ముగిసినట్లేనని చెప్పొచ్చు. నేరచరితులైనవారికి చట్టసభల్లో అవకాశం కల్పించరాదంటూ ఆ మధ్య సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, ఈ నేపథ్యంలోనే మన్మోహన్‌ సర్కార్‌ సైతం నేరచరిత వున్న ప్రజా ప్రతినిథులపై అనర్హత వేటు పడేలా చర్యలు తీసుకుంటామనడం.. వెరసి.. ఇప్పుడు జయలలిత ఆ కోటాలో అనర్హత వేటుకు గురవనున్నారు. మొత్తానికి జైలుకు వెళ్లిన జయలలిత రాజకీయాల్లో మళ్ళీ నెగ్గుకురావడం దాదాపు అసాధ్యమే.