ఆ ‘ఆకర్ష్’లో ఎవరు పడతారు..?

Tuesday, September 23rd, 2014, 04:17:47 PM IST


టీఆర్ఎస్ పార్టీ.. సొంత నిర్మాణం ద్వారా పటిష్టం కావడం కంటే.. వలసల ద్వారానే బలోపేతం అవ్వాలని భావిస్తూ వస్తోంది. అందుకే మిగతా పార్టీల్లో కంటే ఆపరేషన్ ఆకర్ష్.. టీఆర్ఎస్ లో సూపర్ సక్సెస్ అని చెప్పొచ్చు. పార్టీలో ప్రస్తుతమున్న నేతల్లో కూడా టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఇందులో ఉన్న వారికంటే ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా వచ్చిన వారే అధికం. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత.. ఇక టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం మరింత పెరిగింది. అయితే టిఆర్ఎస్ మొదటి నుంచి టీడీపీనే టార్గెట్ చేస్తున్నట్లు కన్పిస్తోంది.

ఈ రెండూ ప్రాంతీయ పార్టీలు కావడం, టీడీపీకి నిర్మాణం బలంగా ఉండడంతో.. ఆ పార్టీలోని నాయకులను గులాబీ పార్టీ వలసలను ప్రోత్సహిస్తోంది. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఈ టార్గెట్ మరింత తీవ్రమైందనే చర్చ పార్టీలో నడుస్తోంది. ఇటీవలే ముగ్గురు ఎమ్మెల్సీలు రాగా, తాజాగా పార్టీలో ముఖ్య నాయకుడుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక టీడీపీ పుట్టినప్పటి నుంచి ఉంటున్న మరో నేత తలసాని శ్రీనివాస యాదవ్ కూడా త్వరలో వస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వీరందరు ఎప్పుడెప్పుడు ఎలా చేరాలో పార్టీ నిర్ణయించిందని, దాని ప్రకారమే చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. త్వరలో జరిగే ప్లీనరీ సమావేశాల్లో కూడా చాలామంది నేతలు చేరే అవకాశం ఉందని బలంగా వినిపిస్తోంది. అంతే కాకుండా టీడీపీ నుంచి చాలామంది నేతలతో పాటు ఆరేడుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టిఆర్ఎస్ నాయకులు చెప్పడం ఈ వలసల తీరుకు నిదర్శనం.

టీఆర్ఎస్ పార్టీలోకి టీడీపీ నుంచి వలసల పర్వం కొనసాగుతుండగానే టీ-టీడీపీ ఫోరం కన్వీనర్, ప్రస్తుత శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యమంత్రి కేసిఆర్ ను సిఎం క్యాంప్ ఆఫీస్ లో అర్ధరాత్రి దాటాక కలువడం చర్చానీయాంశంగా మారింది. ఇప్పటికే టీ-టీడీపీ శాసనమండలి పక్ష నేత టిఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు టీటీడీపీ శాసనసభా పక్ష నేత కూడా ఆ పార్టీని వీడితే ఇక టీడీపీ పరిస్థితిఎలా ఉంటుందో ఆలోచించాలని టిఆర్ఎస్ నేతలంటున్నారు. అదే సమయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పట్లో పార్టీలోకి రాకపోవచ్చనే వాదనలు కూడా ఆ పార్టీలోని నేతలే చెబుతున్నారు. టిఆర్ఎస్ మైండ్ గేమ్ లో భాగమే ఎర్రబెల్లి పర్వమంటున్నారు. టీఆర్ఎస్ పై టీడీపీ దూకుడుగా వ్యవహరిస్తోందని, దీనినుంచి పక్కదారి పట్టించడం, పార్టీని డిఫెన్స్ లోకి నెట్టడం ఇందులో వ్యూహంగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి ఝులక్ లు టిడిపి కి ఇక చాలా ఉంటాయని, తెలంగాణలో టీడీపీ చరిత్రగా మారుస్తామనే ధీమాలో ప్రస్తుతం టీఆర్ఎస్ నేతలున్నారు. నిత్యం టీడీపీని నిద్రపోనివ్వకుండా చేస్తామంటున్నారు.

ముఖ్య నేతలను కోల్పోతున్న టీడీపీకి ఎర్రబెల్లి ఉదంతం షాక్ ఇచ్చింది. నేతలు పోతే నేతలు వస్తారని టీడీపీ అంటుంటే.. టీడీపీలో నేతలు లేకుండా చేస్తామని టీఆర్ఎస్ చెబుతోంది. మరి ఎవరిది పైచేయి అవుతుంది..? ఎవరి మైండ్ గేమ్ లో.. ఎవరు పడుతారో..? రాబోయే రోజుల్లో తెరపై చూడాల్సిందే..