హెచ్-4 వీసాదార్లకు షాకివ్వనున్న ట్రంప్ ?

Sunday, June 17th, 2018, 11:39:51 AM IST

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంతృత్వ పోకడలు రోజు రోజుకూ వికృత రూపం దాలుస్తున్నాయని పలు దేశవారు మండిపడుతున్నారు. ఇప్పటికే కొన్ని దేశాల వారిని అమెరికాకు రానివ్వకుండా అడ్డుకట్ట వేసిన ట్రంప్, అక్కడికి ఉద్యోగాల కోసం వెళ్లిన వారిపై కూడా తన జులూం చూపిస్తున్నారు. స్థానికత అనే అంశంతో క్రితం ఎన్నికల్లో గెలిచినా ఆయన, ప్రస్తుతం అన్నింటా అదే విధానాన్ని అవలంబించాలని చూస్తున్నారు. ఇతర దేశాలనుండి అమెరికాకు వెళ్లిన హెచ్-1 విసాదారుల జీవిత భాగస్వాముల హెచ్-4 ఉద్యోగ నిబంధనలపై త్వరలో షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హెచ్-1 పై ప్రతిభావంతులయిన వారు అక్కడి ఐటి కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, అయితే వారి జీవిత బాగా స్వాములకు కూడా ఉద్యోగ అవకాశం ఇవ్వాలని ఒకప్పటి ఒబామా నేతృత్వంలో ప్రభుత్వం అనుమతి నిచ్చింది. ఆ తరువాత అనేక భారతీయ కుటుంబాలు ఆయన నిర్ణయంతో హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే ట్రంప్ అమెరికన్ గద్దె నెక్కారో అప్పటినుండి ఈ విధమైన హెచ్-4 వీసదారుల ఉద్యోగాలను రద్దు చేయాలనీ కొన్నాళ్ల నుండి కుట్ర పూరిత చర్యలు చేపట్టారు.

ఇక ప్రస్తుతం అక్కడి యు ఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అధికారులు చెపుతున్న వార్తల ప్రకారం, హెచ్-4 విసాదారుల ఉద్యోగాలను పూర్తిగా రద్దు చేసి వారి స్థానే స్థానిక అమెరికన్ మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టినట్లు చెపుతున్నారు. అలానే అటువంటి వీసానిబంధనల్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయాలనీ చూస్తున్నారట. అయితే ఇప్పటికిప్పుడు హెచ్-4 విసదారుల ఉద్యోగాలు తొలగించనప్పటికీ కొన్నాళ్ల తర్వాత అది చేపట్టే తీరుతారని సమాచారం అందుతోంది. ఒకవేళ అదే కనుక జరిగితే అక్కడకు అటువంటి విసాలపై వెళ్లిన వారిలో దాదాపు 70 వేలమందికి పైగా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని స్థానిక అమెరికన్ విశ్లేషకులు చెపుతున్నారు. అయితే ఇప్పటికే అటువంటి వారి ఉద్యోగాలు తొలగించవద్దని అక్కడి భారతీయ ఎన్ఆర్ఐ ట్రంప్ ప్రభుత్వం పై ర్యాలీలు నిరసనలు తెలిపారు. మరి ఈ విషయం పై ట్రంప్ ప్రభుత్వం రానున్న రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి…..