‘రివ్యూ రాజా’ తీన్‌మార్ : ఇజం – కళ్యాణ్ రామ్ కొత్తగా కనిపించాడు..!

Friday, October 21st, 2016, 03:00:32 PM IST


తెరపై కనిపించిన వారు : కళ్యాణ్ రామ్, అధితి ఆర్య
కెప్టెన్ ఆఫ్ ‘ఇజం’ : పూరి జగన్నాథ్

మూల కథ :

సత్య మార్తాండ(కళ్యాణ్ రామ్) అనే ఓ జర్నలిస్ట్ ఇండియాలోని అక్రమార్కులు ప్రజలను దోచుకుని లక్షల కోట్ల బ్లాక్ మనీని విదేశాల్లోని బ్యాంకుల్లో దాచున్న నల్లధనాన్ని తిరిగి ఇండియా తెప్పించాలని అనుకుని అందుకు గాను డాన్ జావెద్ భాయ్ (జగపతి బాబు)ను వాడుకుంటాడు. అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబుకు ఎలా దగ్గరయ్యాడు ? నల్ల ధనాన్ని ఎలా వెనక్కి తెచ్చాడు ? అన్నదే ఈ సినిమా కథ…

విజిల్ పోడు :

1. సినిమాలో కళ్యాణ్ అప్పియరెన్స్, బాడీ లాంగ్వేజ్, పెర్ఫార్మెన్స్ అద్దిరిపోయాయి. ఇంతకూ ముందెన్నడూ చూడని కళ్యాణ్ రామ్ ను ఈ సినిమాలో చూడొచ్చు. అంతలా కళ్యాణ్ రామ్ కష్టపడి చేసుకున్న మేకోవర్ కు ఓ పెద్ద విజిల్ వెయ్యొచ్చు.

2. అలాగే తీసుకున్న సోషల్ సబ్జెక్టు పాతదే అయినా కూడా దానికి కొత్త, సంతృప్తికరమైన ముగింపు ఇచ్చిన దర్శకుడు పూరికి ఓ విజిల్ వెయ్యొచ్చు.

3. ఇక ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో వచ్చే కోర్ట్ సీన్ అయితే హైలెట్ గా ఉంది. అందులో కళ్యాణ్ రామ్ నటన, పూరి రాసిన డైలాగులకు ఓ విజిల్ వెయ్యొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

1. సినిమా ఫస్టాఫ్ ఆసక్తిగానే ఉన్న సెకండాఫ్ కు వచ్చే సరికి ఆ ఫ్లో తగ్గిపోయింది. పూరి ఎప్పటిలాగే కోర్ట్ సీన్ మినహా సెకండాఫ్ సినిమాని చుట్టేసి ప్రయత్నం చేశాడు.

2. ఇక ఇండియాలో ఉన్న నల్ల ధనాన్ని మొత్తాన్ని విదేశాల్లో బ్యాంకు పెట్టి మరీ కాపాడే జావెద్ భాయ్ (జగ్గు భాయ్) ని క్లైమాక్స్ లో కూడా ఏమీ చేయకపోవడం మరో పెద్ద ఢమ్మాల్ పాయింట్.

3. విలన్ గా జగ్గూను ఆరంభంలో పీక్స్ లో చూపించి రాను రాను వీక్ చేసి ఎక్కడా ఆ పాత్రకు బలమైన సన్నివేశాలు రాయకపోవడం పెద్ద మైనస్.

దావుడా – ఈ సిత్రాలు చూశారూ ..!!

–> సినిమాలోని చేజింగ్, ఫైటింగ్స్ లో రౌడీలు కొన్ని అడుగులు దూరం నుండి వరుస పెట్టి హీరో మీదికి తుపాకులు కాలుస్తున్నా చివర్లో ఒకే ఒక్క బుల్లెట్ తగులుతుందంతే. అదే విచిత్రమో మరి.

చివరగా సినిమా చూసిన ఇద్దరు మిత్రులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : అరే.. సినిమా బాగానేవుంది కదా ?
మిస్టర్ బి : సినిమా పర్లేదు కానీ కళ్యాణ్ రామ్ నటనతో, పూరి డైలాగులతో అరిపించారు.
మిస్టర్ ఏ : ఔనౌను.. కళ్యాణ్ రామ్ భలే చేశాడు కొత్తగా. సరే మొత్తానికి ఏమంటావ్.
మిస్టర్ బి : సినిమా పూరి మార్క్ తో యావరేజ్ గానే ఉంది.