అది గ్రెనైడ్ కాదట!

Saturday, October 4th, 2014, 06:23:17 PM IST


ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన సమయంలో స్టాండ్ బై ఉంచిన ఎయిర్ ఇండియా విమానంలో గ్రెనైడ్ ఉన్నట్లుగా వచ్చిన వార్త ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. అయితే ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో భారత భద్రతా ఏజెన్సీలన్నీ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. ఇక మోడీకి ప్రాణహాని ఉందంటూ నిఘా సంస్థలు హెచ్చరించిన నేపధ్యంలో ఈ గ్రెనైడ్ వ్యవహారం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. కాగా ప్రధాని స్టాండ్ బై విమానంలో గ్రెనైడ్ ఉందంటూ వచ్చిన వార్తలన్నీ వదంతులేనని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.

వివరాలలోకి వెళితే మోడీకి స్టాండ్ బై గా ఉంచిన విమానాన్ని ఢిల్లీ నుంచి ముంబై, హైదరాబాద్ ల మీదుగా జెడ్డాకు ప్రయాణికుల సేవల కొరకు వినియోగించారు. అయితే విమానం జెడ్డాకు చేరిన వెంటనే బిజినెస్ క్లాసు సీట్ల కింద గ్రెనైడ్ ఉందని సిబ్బంది భారత అధికారులకు సమాచారమిచ్చారు. దీనితో ఒక్కసారిగా ఉలిక్కిపడిన అధికారులు విచారణ జరిగేంతవరకు విమానాన్ని కదపవద్దని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం దీనిపై విచారణ చేసిన అధికారులు అది గ్రెనైడ్ కాదని, ప్లాస్టిక్ సంచి అని నిర్ధారించారు.