హుధూద్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దుమారం రేపింది. హుధూద్ తుఫాన పై అసెంబ్లీ చర్చ జరిగింది. అయితే… హుధూద్ బాధితులను ఆదుకోవడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సభలో అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొన్నది. జగన్ చేసిన వ్యాఖ్యలపై అధికార పక్షం మండిపడింది. జగన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అయితే… జగన్ సభలో మరిన్ని వ్యాఖ్యలు చేశారు. సభ్య సమాజం సిగ్గు పడేలా తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని జగన్ విమర్శించారు.
దీంతో మరోసారి సభలో గందరగోళం నెలకొన్నది. తెలుగుదేశం పార్టీ నేత అచ్చెంనాయుడు జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. హుధూద్ బాధితులు ప్రతిఒక్కరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అభినందించారని అన్నారు. ఇక 11 చార్జ్ షీట్లలో ముద్దాయిగా ఉన్న జగన్ ఉన్న సభలో తాము ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని అచ్చెంనాయుడు అన్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు గందరగోళం సృష్టించారు. ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ ఎంతవారించినప్పటికీ వినకపోవడంతో సభను వాయిదా వేశారు.