ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ రాజధాని అమరావతిలో నూతన భవంతిని నిర్మించుకున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా తాడేపల్లి గూడెంలో సకల సౌకర్యాలతో నిర్మించిన నూతన గృహ ప్రవేశం బుధవారం ఉదయం 8.19 నిమిషాలకు జరిగింది. వైఎస్ జగన్, భారతి దంపతులు వేద పండితులు చెప్పిన ముహూర్తాన కొత్త ఇంట్లోకి ప్రవేశించారు.
ఈ కార్యక్రమానికి ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుని ఆహ్వానిస్తారని, గృహ ప్రవేశం అనంతరం అక్కడే ఏపీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన ప్యూహంతో పాటు ఫెడరల్ ఫ్రంట్‌కు సంబంధించిన కీలక చర్చలు జరిపే అవకాశం వుందని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వేడెక్కినే వేళ తెలంగాణ సీఎంతో ప్రత్యేకంగా సమావేశం కావడం అనేది సెల్ఫ్ గోల్ అవుతుందని భావించిన జగన్ ఈ కార్యక్రమానికి తెలంగాణ నేతల్ని ఎవర్నీ ఆహ్వానించలేదని తెలిసింది. అయితే ఈ కార్యక్రమంలో మాత్రం జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, బావ అనిల్‌కుమార్‌తో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి, రోజా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. జగన్ రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం అంటూ ప్రచారం చేస్తున్న వారికి ఈ గృహ ప్రవేశమే గట్టి సమాధానం అని ఫైర్ బ్రాండ్ రోజా స్పష్టం చేయడం విశేషం