ప్రభుత్వం అలా చేస్తే.. పవన్ స్పందించక తప్పదేమో..?

Sunday, December 6th, 2015, 05:16:24 PM IST


ప్రభుత్వాలు సరిగా పనిచేయకపొతే ప్రజల తరుపున ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగానే రాజధాని రైతుల భూముల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించారు. రైతులు భూములు స్వచ్చందంగా ఇస్తేనే తీసుకోవాలని.. బలవంతంగా భూసేకరణ ద్వారా లాక్కోకూడదని అన్నారు. ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలని చూస్తే రైతుల తరపున పోరాటం చేస్తానని చెప్పారు. చెప్పిన విధంగానే రైతుల తరపున ఆయన ప్రశ్నించడంతో.. ప్రభుత్వం అప్పట్లో భూసేకరణ జీవోను వెనక్కి తీసుకున్నది.

అయితే, తాజగా చెన్నై లో వరదల సమయంలో అటు చంద్రబాబు, కెసిఆర్ లు స్పందించి ఆదుకుంటామని ప్రకటించారు. ఇక ప్రధాని మోడీ చెన్నైలో ఏరియల్ సర్వే నిర్వహించి వెంటనే తన సహాయాన్ని ప్రకటించారు. అందరు స్పందిస్తున్నా.. పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. ఎందుకని ఇంతవరకు స్పందించలేదో తెలియలేదు.

ఇకపోతే, ఇప్పుడు మరలా.. ఆంధ్ర ప్రదేశ్ రాజధానిలోని తుళ్ళూరు, మంగళగిరి మండలాలలో మిగిలిన భూమిని సేకరించాలని ప్రభుత్వం చూస్తున్నది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ భూములను భూసేకరణ ద్వారా కాకుండా.. భూసమీకరణ ద్వారానే సేకరించాలని అనుకుంటున్నదట. నోటిఫికేషన్ ఇచ్చాక.. వారం రోజుల పాటు సంబంధిత భూయజమానుల నుంచి వివరణలు తీసుకుంటారు. వారి అభిప్రాయలు తెలుసుకొని వారివద్దనుంచి భూములు సేకరిస్తారట. నోటిఫికేషన్ ఇస్తే.. పవన్ మరోసారి రాజధాని రైతుల పక్షాన స్పందించక తప్పనిసరి పరిస్థతివస్తుంది.