విజ‌య‌సాయిరెడ్డి గుట్టు విప్పిన జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ !

Sunday, April 21st, 2019, 08:59:16 AM IST

ఏపీలో ఎన్నిక‌ల వేడి ముగిసిన అనంత‌రం ఫ‌లితాల కోసం వాతావ‌ర‌ణం ప్ర‌శాంతంగా వుంటుంద‌ని అంతా భావించారు. కానీ అక్క‌డ జ‌రుగుతున్న తంతు మాత్రం ఏ మాత్రం ప్ర‌శాంతంగా లేదు. ఫ‌లితాలు వెలువ‌డే వ‌ర‌కు ఇరు పార్టీల నాయ‌కులు ప్ర‌శాంతంగా తామూ వుండ‌టం లేదు. ప్ర‌త్య‌ర్థి పార్టీ నాయ‌కుల్ని వుండ‌నివ్వ‌డం లేదు. రోజుకో ర‌చ్చ పేరుతో వీధికెక్కుతున్నారు. గ‌త రెండు మూడు రోజులుగా జ‌నసేన ఎంపీ అభ్య‌ర్థి, మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ను టార్గెట్ చేస్తూ వైసీపీ నేత విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ట్విట్టర్ వేదిక‌గా దీనికి జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. అయినా వైసీపీ నేత మ‌ళ్లీ రెచ్చిపోయి జేడీపై విరుచుకుప‌డటం సంచ‌ల‌నంగా మారింది. త‌న‌పై విజ‌యసాయిరెడ్డి చేస్తున్న ట్విట్ట‌ర్ వార్‌కు తాజ‌గా జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ఫుల్ స్టాప్ పెట్టే ప్ర‌య‌త్నం చేశారు.

వైసీపీ నేత విజ‌యసాయిరెడ్డి త‌న‌పై చేస్తున్న ట్విట్ట‌ర్ యుద్ధానికి త‌న‌దైన స్లైల్లో ఝ‌ల‌కిచ్చారు మాజీ జేడీ. 88 స్థానాల్లో త‌మ పార్టీ విజ‌య‌కేత‌నం ఎగురువేస్తుంద‌ని ల‌క్ష్మీనారాయ‌ణ చేసిన ట్విట్ పై వైసీపీ నేత కౌంట‌ర్ ఇచ్చారు. ఇక్క‌డి నుంచే ఇద్ద‌రి మ‌ధ్య ట్విట్ట‌ర్ యుద్ధం మొద‌లైంది. అది ఇప్పుడు తారా స్థాయికిచేరింది. అయితే దీనికి త‌న‌దైన స్టైల్లో జేడీ ముగింపు ప‌లికే ప్ర‌య‌త్నం చేశారు. `గౌర‌వ‌నీయులైన రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డిగారికి.. నేను రాజ‌కీయాల్లోకి చేర‌తాన‌ని చెప్ప‌గానే అన్ని పార్టీలు వారి ప్ర‌తినిధుల‌ను పంపి వారి పార్టీలో చేర‌మ‌ని కోరిన విష‌యాన్ని టీవి ఛాన‌ళ్ల ద్వారా చెప్పేశాను. అయితే ఆశ్చ‌ర్యం ఏమిటే మీ పార్టీలోకి నాకు ఎర్ర‌తివాజీ ప‌రుస్తూ ఆహ్వానిస్తాన‌న్ని విష‌యం మీరు ఎక్క‌డా చెప్ప‌క‌పోవ‌డం విడ్డూరంగా వుంది. దీన్ని బ‌ట్టే మీరు ఎన్ని అబ‌ద్ధాలు చెబుతున్నారో..ఎన్ని నిజాల్ని దాస్తున్నారో అర్థ‌మ‌వుతోంది` అంటూ జేడీ పెట్టిన పోస్ట్‌కి తిరిగి విజ‌య‌సాయిరెడ్డి కౌంట‌ర్ ఇవ్వ‌క‌పోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. జేడీ కౌంట‌ర్ ఇచ్చి దాదాపు ప‌ది గంట‌లు కావ‌స్తున్నా విజ‌య‌పాయిరెడ్డి నుంచి స‌మాధానం లేక‌పోవ‌డంతో జేడీ భ‌లే కౌంట‌రేశార‌ని అంతా చెప్పుకుంటున్నారు.