జ‌న్మ‌భూమిలో సేనాని.. ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో రైళ్లు!!

Thursday, November 1st, 2018, 11:10:40 PM IST


జ‌న‌సేనాని ప‌వ‌న్‌కల్యాణ్ రాజ‌కీయ వేదిక‌పై దూకుడు పెంచి దూసుకుపోతున్నారు. ఆ క్ర‌మంలోనే అధికార‌ప‌క్షం, ప్ర‌తిప‌క్షం అనే తేడా లేకుండా అంద‌రికీ ఇది ఊహించ‌ని ప‌రిణామంగానే ప‌రిణ‌మించింది. ఇటీవ‌ల ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌, గోదారి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న పెద్ద స్థాయిలో విజ‌య‌వంతం అవ్వ‌డంతో, త‌న ప‌ర్య‌ట‌న‌ల విస్త్ర‌తిని జ‌న‌సేనాని పెంచేస్తున్నారు. తాజాగా సేనానితో రైలు ప్ర‌యాణం అంటూ.. విజ‌య‌వాడ నుంచి తుని వ‌ర‌కూ త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభిస్తున్నారు. హైద‌రాబాద్ నుంచి విశాఖ వ‌ర‌కూ వెళ్లే జ‌న్మ‌భూమి ఎక్స్‌ప్రెస్ అంటే ప్ర‌జ‌ల్లో గొప్ప సెంటిమెంటు ఉంది. అది సామాన్యుల రైలు అన్న అభిమానం ఉంటుంది. అందుకే ప‌వ‌న్ ఈ రైల్లో త‌న ప్ర‌యాణాన్ని ఖాయం చేశారు. న‌వంబ‌ర్ 2న‌ విజ‌య‌వాడ నుంచి గోదావ‌రి జిల్లా- తుని వెళ్లే వర‌కూ రైలులో ప్ర‌యాణీకులంద‌రినీ ప‌వ‌న్ ప‌ల‌క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అంతేకాదు.. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఇదే రైలులో అన్ని స్టేషన్ల నుంచి జ‌న‌సేని అనుచ‌రులు రైలు ఎక్కుతారు. అలా త‌మ మీటింగ్ ద్వారా పార్టీ స్థాయిని, స‌త్తాని జ‌నాల్లోకి తీసుకెళ్లాల‌న్న‌దే ప్ర‌ణాళిక‌.

ఈ ప్ర‌యాణంలో ప‌వ‌న్ షెడ్యూల్ కూడా ఖ‌రారైంది. రేప‌టి మధ్యాహ్నం 1 గం.20 ని.లకు రైల్వే పోర్టర్లతో మాట్లాడతారు. ఆ తరవాత మామిడి రైతులు, అసంఘటిత రంగంలో ఉన్న చిరు వ్యాపారులు రైల్వే వెండర్లతో, చెరకు రైతులు – చేనేత కార్మికులు, విద్యార్థులు, ఏటికొప్పాక బొమ్మల తయారీ కళాకారులతో ఈ ప్రయాణంలో మాటా మంతీ సాగిస్తార‌ట‌.

అయితే ప‌వ‌న్ ఇలా తుని వ‌ర‌కూ రైలు ప్ర‌యాణం చేయ‌డాన్ని కొంద‌రు నెగెటివైజ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కాపుల రిజ‌ర్వేష‌న్ ఉద్య‌మంలో తుని ఘ‌న‌ట‌ను గుర్తు చేసి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్ని భ‌య‌పెట్టే కుట్ర‌కు పాల్ప‌డుతున్నారు. నాడు కాపు ఉద్య‌మంలో ర‌త్నాచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌ని తునిలో త‌గుల‌బెట్టిన ఘ‌ట‌న‌ను గుర్తు చేసి ఈ రైలు ప్ర‌యాణం త‌గ‌ద‌ని కొంద‌రు సెల‌విచ్చేస్తున్నారు. అయితే ఇలాంటి ఉడ‌త ఊపుల‌కు జ‌న‌సేనాని భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేదు. జ‌న‌సేనాని వెంట వెళ్లే కార్య‌క‌ర్త‌లు అస‌లే భ‌య‌ప‌డ‌ని స‌న్నివేశం ఉంది. ఈసారి ఎన్నిక‌ల్లో ఏపీలో ఉన్న 25 శాతం కాపు ఓట్లు జ‌న‌సేన ఖాతాలోకి వెళ్ల‌డం ఖాయ‌మ‌న్న మాటా వినిపిస్తోంది. కాపుల‌తో పాటు మెజారిటీ భాగంగా ఉన్న ద‌ళితులు, ఇత‌ర నిమ్న‌కులాల ఓట్లు ప‌వ‌న్‌కే అనుకూలంగా ఉన్నాయి. ఆ మేర‌కు కాపులంద‌రిలో రాజ‌కీయ చైత‌న్యం తేవ‌డంలో ప‌వ‌న్ ప్ర‌య‌త్నం స‌ఫ‌ల‌మ‌వుతోంది. ప‌వ‌న్ అంత‌గా జ‌నాల్ని ప్ర‌భావితం చేస్తున్నాడు.