జయలలిత ఔట్.. మరి జగన్..?

Monday, September 29th, 2014, 08:06:35 PM IST


అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అరెస్ట్ కావడం లోటస్ పాండ్ లో పెద్ద చర్చగా మారింది. పద్దెనిమిదేళ్లు సాగిన ఈ కేసులో జయకు శిక్ష తప్పక పోవడంతో, పదకొండు చార్జ్ షీట్లు ఉన్న జగన్ భవిష్యత్ పై ఆయన శిబిరంలో చర్చ మొదలైంది. ఒక వైపు ఈడి కేసులు, మరో వైపు సిబిఐ వెంటాడుతున్న నేపథ్యంలో జగన్ కేసుల వ్యవహారం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనియాంశంగా మారింది. తాజాగా సిబిఐ మరో రెండు చార్జ్ షీట్లకు సిద్దమవుతున్న తరుణంలో ఈ కేసుల వ్యవహారం జగన్ మెడకు చుట్టుకోక తప్పదా? అనే సందేహం వ్యక్తమవుతోంది.

కేవలం అరవై ఆరు కోట్ల అక్రమాస్తులకే నాలుగేళ్లు జైలు, వందకోట్ల జరిమానా పడితే, నాలుగువేల కోట్ల అక్రమార్జన అభియోగాలపై జగన్ పరిస్దితి ఏమిటినేది పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఒక వైపు సిబిఐ, మరో వైపు ఈడి వెంటపడుతున్న నేపథ్యంలో జగన్ కు భవిష్యత్ లో తిప్పలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాక ఈడి ఇప్పటికే ఏడువందల కోట్ల కు పైగా సీజ్ చేసింది. ఆ కేసు వ్యవహారం ఢిల్లీ లో హాట్ హాట్ గా నడుస్తోంది. ఒక వేళ ఈడి ముందు అభియోగాలు రుజువైతే ఆ డబ్బును సీజ్ చేయడంతో పాటు జగన్ కు శిక్ష తప్పని పరిస్దితి. అలాగే ఇప్పటికే 11 చార్జ్ షీట్లు దాఖలు చేసిన సిబిఐ, తాజాగా మరో రెండు చార్జ్ షీట్లను సిద్దం చేస్తుంది. దీంతో జగన్ కేసుల నుండి బయట పడడం అంత తేలిక కాదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

జయ కేసు 18 ఏళ్లు నడిచింది కాబట్టి, ఒక వేళ జగన్ కేసుల వ్యవహారం తేలాలంటే మరో పదేళ్లు పడుతుందని పార్టీలో కొందరు అంటున్నారు. అయితే సిబిఐ కేసుల వ్యవహారం తేలడం కొంత ఆలస్యం అయినా, ఈడి నుంచి తప్పించుకోవడం మాత్రం అసాధ్యం అని చెబుతున్నారు. ఇప్పటికే ఈడీ ప్రత్యేక న్యాయ స్దానంలో కేసు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో మరో ఆరు నెలల్లో ఈడి ఈ కేసును తేల్చేస్తుందని న్యాయనిపుణులు అంటున్నారు. కాబట్టి ఇన్ని ఆర్థిక నేరాలకు సంబంధించి అభియోగాలు ఎదుర్కుంటున్న జగన్, తన ఈ కేసుల వ్యవహారం నుండి ఎలా గట్టెక్కుతారనేది పెద్ద సవాల్ గా మారింది.

మొత్తానికి తమిళనాట కేసుల వ్యవహారం ఏపీని తాకిందని చెప్పుకోవాలి. జయలలిత తీర్పు రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయ వర్గాల్లో మాత్రం జగన్ పై తీవ్ర చర్చజరగడం విశేషం. ఇదిలా ఉంటే పార్టీ వర్గాలు మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని చెబుతున్నాయి.