‘రివ్యూ రాజా’ తీన్‌మార్ : కాష్మోరా – భయపెట్టలేదు కానీ నవ్వించాడు ..!

Friday, October 28th, 2016, 03:38:34 PM IST


తెరపై కనిపించిన వారు : కార్తి, నయనతార, శ్రీదివ్య
కెప్టెన్ ఆఫ్ ‘కాష్మోరా’ : గోకుల్

మూల కథ :

కాష్మోరా (కార్తి) అనే వ్యక్తి తనకు క్షుద్ర శక్తులు ఉన్నాయని ప్రజల్ని నమ్మించి వారి భయాన్ని క్యాష్ చేసుకుంటుంటాడు. అలా కాష్మోరా ఎప్పటిలాగానే తన బంగ్లాలో దెయ్యాలున్నాయని, వాటిని బయటికి పంపితే చెబుతాడు. దీంతో కాష్మోరా ఆ ఇంట్లోకి వెళతాడు. అక్కడ తన కుటుబంతోపాటే చిక్కుకుపోతాడు. ఇక ఆ బంగ్లాలో కాష్మోరా పడ్డ కష్టాలేమిటి ? అసలు అందులో ఎవరున్నారు ? వాళ్ళు కాష్మోరాని ఎందుకు బంధించారు ? చివరకు కాష్మోరా వాళ్ళ నుండి ఎలా తపించుకున్నాడు ? అనేదే ఈ సినిమా స్టోరీ…

విజిల్ పోడు :

1. కార్తి ఎప్పటిలాగే తన నటనతో సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ బిగినింగ్, ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ లలో కార్తి పెర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్ చాలా బాగున్నాయి. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. అలాగే రాజ్ నాయక్ పాత్రలో అతని స్క్రీన్ ప్రెజన్స్, భిన్నమైన నటన బాగున్నాయి. కనుక మొదటి విజిల్ కార్తికి వెయ్యాలి.
2. ఇక దర్శకుడు గోకుల్ కాష్మోరా పాత్రకు రాసుకున్న డైలాగులు, ఆ పాత్ర ద్వారా పండించిన కామెడీ సినిమాకె హైలెట్ గా నిలిచాయి. కనుక అతనికి రెండో విజిల్ వేయొచ్చు.

3. ఇక సెకండాఫ్ లో వచ్చే ఫాంటసీ ఎపిసోడ్ లో కొని సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్, రాజ్ నాయక్ పాత్ర గెటప్ లు కొత్తగా అనిపించాయి. కాబట్టి వీటికి మూడో విజిల్ వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

1. సినిమా మొదలవడం బాగానే ఉన్నా పోను పోను సన్నివేశాలు రిపీట్ అవుతూ బోర్ కొట్టిస్తాయి. అలాగే సెకండాఫ్ లో కూడా సన్నివేశాల పునరావృతం, ఎక్కువ రన్ టైమ్ విసుగు తెప్పించాయి.

2. ఫాంటసీ ఎపిసోడ్ లో కథ బలంగా లేకపోవడం, రాజ్ నాయక్ పాత్ర చిత్రీకరణ అంత ప్రభావవంతంగా ఉండకపోవడం వలన సినిమాపై ఆసక్తి తగ్గింది.

3. ఇక మధ్య మధ్యలో వచ్చే పాటలు ఏమాత్రం వినడానికి అనువుగా లేకుండా విసుగు తెప్పించాయి.

దావుడా.. ఈ సిత్రాలు చూశారూ ..!!

-> ఒక సన్నివేశంలో రత్నమహాదేవి పాత్రలోని నయనతార రాజ్ నాయక్ పాత్రలో ఉన్న కార్తిని చంపడానికి కాల కూట విషాన్ని ధూపంలో వేసి తన కురులకు ఆ పొగను పట్టించుకుని రాజ్ నాయక్ ను స్పృహ తప్పేలా చేస్తుంది. మరి ఆ పొగాకు దగ్గరగా వెళ్లిన నయనతారకు మాత్రం ఏమీ కాకపోవడం విచిత్రమే మరీ.

-> ఇక హర్రర్ జానర్ సినిమా అన్నారు..దెయ్యాలు, భూతాలు స్క్రీన్ మీద భీభత్సం చేస్తున్నాయి కానీ చూసే ప్రేక్షకులకు మాత్రం ఏమాత్రం భయం కానీ, కలవరం కానీ కలగకపోవడం సిత్రమే.

చివరగా సినిమా చూసిన ఇద్దరు మిత్రులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : ఏరా.. సినిమా ఎలా అనిపించింది ?
మిస్టర్ బి : సినిమా అంతంత మాత్రమే కానీ కార్తి నటన, కామెడీ టైమింగ్ అద్దిరిపోయాయి.
మిస్టర్ ఏ : అది సరేరా హర్రర్ జానర్ అన్నారు.. కానీ నా పక్కనున్న బుడ్డోడు కూడా బెదరలేదు.
మిస్టర్ బి : అరే.. రెండు మూడు జానర్లు కలిపి ఒకేసారి తీసేప్పుడు అందులో ఒకటి అరా మిస్సవుతుంటాయి… నీకు తెలీదులే ఊరుకో.