సెన్సార్ నా స్వేచ్చకు చెక్ పెడుతోంది!

Friday, April 17th, 2015, 09:21:07 AM IST


ప్రముఖ తమిళ నటుడు కమల్ హసన్ సెన్సార్ బోర్డుపై మరోమారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగా సెన్సార్ బోర్డు తన స్వేచ్చను హరిస్తోందంటూ కమల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 2013లో కమల్ నటించిన ‘విశ్వరూపం’ విడుదల సమయంలో సెన్సార్ బోర్డు అతనిని ముప్పతిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. అలాగే మొదట ఆ సినిమాను తమిళనాడులో 15 రోజుల పాటు బ్యాన్ చెయ్యగా తరువాత కొన్ని సన్నివేశాలను మ్యూట్ చేసి సినిమాను విడుదల చేశారు.

ఇక ఇప్పుడు తాజాగా కమల్ సెన్సార్ పై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. కమల్ మట్లాడుతూ సెన్సార్ బోర్డు తన స్వేచ్చను హరిస్తోందని, బోర్డులో కొంతమంది అధికారులతో ఈ విషయంపై మాట్లాడానని తెలిపారు. అలాగే సెన్సార్ సభ్యులు కూడా సినిమాలను ప్రేమిస్తారని, అయితే నిబంధనల మేరకే వారు తమ పనిని నిర్వర్తిస్తారని కమల్ వివరించారు. ఇక తన పోరాటం సీబీఎఫ్ సీ పైనేగాని సభ్యులపై కాదని, బోర్డులోని సభ్యులు అందరూ తనకు స్నేహితులేనని, సినిమా ద్వారా భావ వ్యక్తీకరణ చేసేందుకు భంగం కలిగిస్తున్న సెన్సారు తీరుపైనే పోరాడి గెలుస్తానని కమల్ స్పష్టం చేశారు.