ఆ ఇద్దరు ఎదురు పడ్డారు.. కాని..!

Thursday, December 10th, 2015, 08:23:22 AM IST


బుధవారం రోజున ఢిల్లీ సాక్షిగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి కలుసుకున్నారు. ఇద్దరు ఎదురెదురుపడి కాసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం ఇద్దరు బిజీ అయిపోయారు. ఢిల్లీలో ఇప్పుడిదే హాట్ టాపిక్. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూతురి వివాహ వేడుకకు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆ వేడుకలో ఇద్దరు ఎదురు పడగా కాసేపు పలకరించుకున్నారు. అనంతరం ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు కేంద్రమంత్రులను కలిసే పనిలో ఉండగా, కెసిఆర్ విభజన సమయంలో ఇచ్చిన హామీల గురించి మంత్రులతో చర్చలు జరుపుతున్నారు.

ఇక, ఇదిలా ఉంటే, ఎన్నికల అనంతరం కెసిఆర్, చంద్రబాబు ల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనేది. దీనికి తోడు ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులతో రచ్చకెక్కారు. అయితే, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి చంద్రబాబు కెసిఆర్ ఇంటికి వెళ్లి ఆయనను ఆహ్వానించారు. కెసిఆర్ కూడా అమరావతి కి వెళ్లారు. ఆ తరువాత అంతా మారిపోయింది. కత్తులు, బాణాలు సంధించుకునే ఇద్దరు చంద్రులు మాటల దూకుడును తగ్గించారు. కలిసి పనిచేస్తే.. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయనే నిర్ణయానికి వచ్చారు. ఇది మంచి పరిణామమే అని చెప్పొచ్చు.