సినిమా చూపిస్తున్నాను అనుకున్నారు!

Monday, April 20th, 2015, 08:29:56 AM IST


తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం హైదరాబాద్ లో రసమయి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కళాకారుల సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తుందా? అని చాలా మంది అనుమానించారని, అన్యాయం చేశారని, మరికొందరు ఉద్యమాన్ని మధ్యలోనే వదిలేశారని గుర్తు చేశారు. అలాగే తెలంగాణ ఎలా వస్తుందో తాను చెబితే సినిమా చూపిస్తున్నానని అనేకులు ఎద్దేవా చేశారని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఉద్యమంలో కళాకారుల సేవలు మరువలేనివని, ఇకపై బంగారు తెలంగాణ లోనూ కళాకారుల భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ కోసం ప్రజల్లో విశ్వాశం నెలకొల్పేందుకు చాలా సమయం పట్టిందని, ఉద్యమం సమయంలో కళాకారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావని కెసిఆర్ పేర్కొన్నారు. ఇక సినిమాలలో కూడా తెలంగాణ పైన ఘోర దాడి జరిగిందని, ఉద్యమంలో చిట్టచివరి వరకు తమ వెంట నిలిచింది కళాకారులేనని కెసిఆర్ తెలిపారు.

అటుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలంగాణ చెప్పులన్నా, మా డప్పులన్నా భయమేనని ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి సెటైర్ వేశారు. అలాగే తెలుగుదేశం వారు తక్కువ వాళ్ళు కాదని ఉద్యమాన్ని కార్నర్ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని, వాటిని ప్రజలు తిప్పికొట్టారని కెసిఆర్ తెలిపారు. ఇక చిన్నప్పుడు తాను పాటలు పాడేవాడినని చెప్పిన కెసిఆర్ కళాకారుల విజ్ఞ్యప్తి మేరకు తన గేయాలు, పద్యాలతో ఆద్యంతం ఆకట్టుకున్నారు.