చంద్రబాబుకు ఊహించ‌ని షాక్.. కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

Tuesday, December 11th, 2018, 06:32:06 PM IST

ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఓ వైపు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అయ్యి…కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న ఆయనకు ఇది ఏ మాత్రం మింగుడుపడని పరిణామం. ఈ ప్రభావం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏపీలో జరిగే ఎన్నికలపై ఉండటం కూడా ఖాయంగా కన్పిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలసి మహాకూటమి ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. పైగా తెలంగాణ కాంగ్రెస్‌కు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం కూడా చేశారని జోరుగా ప్రచారం జరిగింది. అంతే కాదు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలసి మరీ ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ ప్రగతిలో తన పాత్ర కూడా చాలా ఉందని అంటూ ప్రచారం చేశారు. అయితే మహాకూటమి ఏర్పాటే కెసీఆర్‌కు ఓ వరంగా మారింద‌ని తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు చూస్తే ఎవ‌రికైనా తెలుస్తోంది.

అయితే మ‌హాకూట‌మి ఏర్ప‌డ‌డం.. తెలంగాణ‌లో చంద్ర‌బాబు ఎంట్రీ ఇవ్వ‌డంతో రాజ‌కీయ‌స‌మీక‌ణాల్లో మార్పులు వ‌చ్చిన మాట్ వాస్తవం. రాజ‌కీయ‌నిపుణులు కూడా ఈ ఎన్నిక‌ల్లో వార్ వ‌న్ సైడ్ కాద‌ని, పోటా పోటీగా జ‌రుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మాత్రం చాలా చ‌క్క‌గా డీల్ చేసి.. ఆ ప‌రిస్తితుల్నే ఓ అస్త్రంగా చేసుకుని ముందుకు సాగారు. మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు జోక్యం చేసుకుంటే నష్టపోయేది తెలంగాణ ప్ర‌జ‌లేన‌ని.. కంగారు ప‌డ‌కుండా.. ఆలోచించి ఓటు వేయాలని కోరటం ద్వారా తెలంగాణ ప్రజలపై కెసీఆర్ ప్రయోగించిన అస్త్రాలు ఫలించినట్లు ఉన్నాయి. ఏతా వాతా తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలంగాణ ఎన్నికల విషయంలో జోక్యం చేసుకుని ఇరకాటంలో పడినట్లు అయింది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కెసీఆర్ ఏపీ రాజకీయాల విషయంలో ప్రతిపక్ష నేత జగన్‌కు పరోక్ష సాయం అందించటం ఖాయంగా కన్పిస్తోంది. తెలంగాణ ఎన్నికల విషయంలో అతి జోక్యం ద్వారా చంద్రబాబు తెలంగాణతోపాటు ఏపీలో కూడా దెబ్బతినే పరిస్థితి కన్పిస్తోంది.

ఈ క్ర‌మంలో తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తెలుగు ప్రజలు బాగుండాలని తాను కోరుకుంటున్నానని, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్మమంత్రి కేసీఆర్ అన్నారు. దేశ రాజకీయాల్లో బాగు చేసే క్రమంలో తప్పకుండా ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామన్నారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుంటే తెలంగాణ ప్రజలు తనను తప్పు పడతారన్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టడం ఖాయమన్నారు. చంద్రబాబు అనవసర వ్యాఖ్యలు చేసి ఉన్న పరువు కాస్తా పోగొట్టుకున్నారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తనకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష మంది ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెప్పారన్నారు. తనను అక్కడి రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. చంద్రబాబు అందరి చంకల్లో దూరే అలవాటన్నారు. నరేంద్ర మోదీతో నాలుగేళ్లు కాపురం చేసిన చంద్రబాబు తర్వాత తేడాలొచ్చి ఇప్పుడు ఫ్రంట్ అంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మోదీని అతిగా పొగిడింది చంద్రబాబే అన్నారు. తెలంగాణ చంద్రబాబు జాగీరు కాదని.. చంద్రబాబుకు పైత్యం ఎక్కువని.. త్వ‌ర‌లోనే దించుతామ‌ని కేసీఆర్ త‌న‌దైన శైలిలో సెటైర్ వేశారు.