మొన్నటి వరకు బాబు హైదరాబాద్ లో .. ఇప్పుడు కెసిఆర్ అమరావతిలో..!

Saturday, January 2nd, 2016, 05:34:23 PM IST


చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు హైదరాబాద్ లోనే ఉన్నారు. హైదరాబాద్ లో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనను చూసుకోవడం ఇబ్బందిగా మారడంతో.. బాబు తన మకాం ఏపి రాజధాని అమరావతికి మార్చారు. ఇప్పుడు బాబు విజయవాడలోనే క్యాంప్ ఆఫీస్, నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్నారు. ఇది అలా ఉంచితే..ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన మొదట్లో ఇద్దరు సిఎంలో టామ్ అండ్ జెర్రీల కొట్లాడుకునే వారు. రెండు రాష్ట్రాల సిఎం ల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే విధంగా మారిపోయింది. అసలు ఇది మారుతుందా.. మారదా అనుకున్న సమయంలో.. అమరావతి ఇన్విటేషన్ తో అంతా మారిపోయింది. తరచుగా ఇద్దరు సిఎంలు కలుసుకుంటున్నారు.

ఇకపోతే, ఈ నెలలో కెసిఆర్ విజయవాడ వెళ్ళనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి.. మన ఊరు కార్యక్రమంలో బిజీ గా ఉన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే కెసిఆర్.. అమరావతి వెళ్తారు. నదీ జలాల పంపకం విషయంలో రెండు రాష్ట్రాల సిఎంలు చర్చలు జరుపుతారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని, అప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు వెళ్తాయని ప్రజలు సైతం కోరుకుంటున్నారు.