కెసిఆర్ కు సీఎన్ఎన్-ఐబిఎన్ పాపులర్ అవార్డు!

Wednesday, March 18th, 2015, 08:32:11 AM IST


తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు సీఎన్ఎన్-ఐబిఎన్ పాపులర్ చాయిస్ -2014 అవార్డు వరించిన సంగతి తెలిసిందే. కాగా ఈ అవార్డును మంగళవారం కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా కెసిఆర్ తరపున తెరాస ఎంపీ కే కేశవరావు అందుకున్నారు. ఇక సీఎన్ఎన్-ఐబీఎన్ ఈ అవార్డును 2006వ సంవత్సరం నుండి ఆరు విభాగాలలో ప్రతీ ఏడాది అందింస్తోంది. కాగా సామాజిక వేదికలలో ప్రజాభిమానాన్ని కొలమానంగా తీసుకుని ఈ అవార్డులను సీఎన్ఎన్-ఐబీఎన్ ప్రకటిస్తూ వస్తోంది.

ఇక కెసిఆర్ తరపున అవార్డును అందుకున్న కేశవరావు మాట్లాడుతూ ఈ గౌరవం తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులకు అంకితమని పేర్కొన్నారు. అలాగే ఈ అవార్డుపై తెరాస ఎంపీలు సీతారాం నాయక్ , నర్శయ్య గౌడ్, వినోద్ కుమార్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్ లు స్పందిస్తూ ఇది కేవలం సీఎన్ఎన్-ఐబీఎన్ ఇచ్చిన పురస్కారం మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా ప్రజలు ఓటు వేస్తేనే ఈ అవార్డు దక్కిందని వివరించారు. అలాగే తెలంగాణ అనేది ఒక బ్రాండ్ అయితే దానికి కెసిఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని ఎంపీలు ప్రశంశలను అందించారు.