ప్రభుత్వ ఉద్యోగం కోసం తండ్రిని హతమార్చాడు

Saturday, April 28th, 2018, 12:45:50 AM IST

అతనో నిరుద్యోగి. ప్రభుత్వ ఉద్యోగం కోసం గత కొన్నేళ్ల నుంచి చాలా కష్టపడుతున్నాడు. ఎన్ని ఎంట్రెన్స్ పరీక్షలు రాస్తున్నాడు, ఎన్నో ఇంటర్వ్యులకు వెళ్తున్నాడు, కానీ ఫలితం దక్కడం లేదు. గవర్నమెంట్ జాబ్ రాకపోవడంతో.. తీవ్ర స్థాయిలో మనస్తాపానికి గురయ్యి నిరాశ చెందాడు. ఎలాగైనా తన తండ్రికున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని తాను దక్కించుకోవాలని.. ఏకంగా తండ్రిని హత్య చేయించాడు ఓ కుమారుడు. ఈ ఘటన బీహార్ ముంగర్ జిల్లాలోని ఈస్ట్ కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే ఓం ప్రకాశ్ మండల్ అనే ఓ వ్యక్తి రైల్వేలో ఉద్యోగి. ఆయన కుమారుడు పవన్(28).. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాడు. అయితే పవన్‌కు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఉద్యోగం రావడం లేదు. తన తండ్రి.. ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందనున్నారు. ఇక ఎలాగైనా తన తండ్రిని హత్య చేయించి.. కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందాలని పవన్ స్కెచ్ వేశాడు. దీంతో ఇద్దరు కిరాయి వ్యక్తులతో రూ. 2 లక్షలకు మంచి డీల్ కుదుర్చుకున్నాడు. ముందస్తుగా రూ. లక్ష ఇచ్చాడు. పథకం ప్రకారం తండ్రి ఓం ప్రకాశ్‌ను హత్య చేశారు. తరువాత మిగితా లక్ష ఇవ్వడానికి వెనుకాడాడు, వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరికొని ఈ కేసులో పవన్‌తో పాటు కిరాయి వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు.