బాబూ చిరు..ఇది సినిమా కాదు!

Monday, September 22nd, 2014, 12:58:57 PM IST


పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ నేతలు కావూరి సాంబశివరావు, కృష్ణంరాజులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా భాజపా సీనియర్ నేత కృష్ణంరాజు కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ నటుడు అయిన మెగాస్టార్ చిరంజీవిపై విమర్శనాస్త్రాలను సంధించారు. ఆయన మాట్లాడుతూ వందరోజుల పాలనలో దేశంలోని పరిస్థితులు మారడానికి ఇదేమైనా సినిమానా అంటూ చిరంజీవిపై మండిపడ్డారు. అలాగే డిపాజిట్లు రాని పార్టీ నేతలు కూడా మమ్మల్ని విమర్శిస్తారా అంటూ కృష్ణంరాజు నిప్పులు చెరిగారు.

కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుండి ఢిల్లీకి విమానాలలో చక్కర్లు కొట్టడం మినహా ఏ పనీ చెయ్యటంలేదని, అలాగే రుణమాఫీపై చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని చిరంజీవి ఇటీవల విమర్శించిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా చిరంజీవి, వంద రోజుల పండుగను సినిమాలలో చేసుకుంటారని, అధికార పక్షం అయిదేళ్ళ పాలన ఉండగా వందరోజులకే సెలబ్రేట్ చేసుకోవడం విడ్డూరంగా ఉందని కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు. మరి ఆ వ్యాఖ్యలకు సమాధానమే ఈ భాజపా నేతల సెటైర్ అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా!