రాజధాని కోసం భూమి కావాలి..!

Sunday, October 12th, 2014, 03:24:12 AM IST

cn-babu
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘతో.. ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు సేకరించిన వివరాలు, భూముల లభ్యత, వాటి ధరలు, రైతుల డిమాండ్లు తదితర విషయాలను ముఖ్యమంత్రికి కమిటీ సభ్యులు వివరించారు.

రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని ఎలా సేకరించాలి, అందుకు ల్యాండ్ పూలింగ్ సహా ఏ విధానాన్ని అనుసరించాలి, నియమనిబంధనలు ఎలా ఉండాలి తదితర విషయాలలో ప్రభుత్వానికి తగిన సలహాలు ఇవ్వడానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, రావేల కిషోర్‌, రఘునాథరెడ్డి ఈ ఉప సంఘంలో సభ్యులు. భూ సేకరణ కమిటీకి కన్వీనర్‌గా సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి డి.సాంబశివరావును నియమించారు.

భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తే మంగళగిరి పరిసరాలలో రాజధానిని నిర్మించాలని.. లేనిపక్షంలో నూజివీడు ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మొదటి నుంచీ ఆలోచిస్తోంది. అయితే.. విజయవాడ- గుంటూరు మధ్యే రాజధానిని నిర్మిస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో… వీజీటీఎం పరిధిలోనే రాజధాని ఏర్పాటవుతుందని ఖాయంగా తేలిపోయింది. అయితే.. దీనికి భూసేకరణే ప్రధాని అడ్డంకి. మరి ప్రభుత్వానికి రైతులు ఏ విధంగా సహకరిస్తారు.. ప్రభుత్వం వారిని ఏ విధంగా బుజ్జగిస్తుందనేదే సవాల్ గా మారింది.