కూచిభొట్ల హత్య కేసులో ఫైనల్ రిజల్ట్ .. 50ఏళ్ల జైలు శిక్ష?

Wednesday, March 7th, 2018, 06:49:13 PM IST

గత ఏడాది అమెరికాలో తెలుగు వ్యక్తి శ్రీనివాస్‌ కూచిభొట్ల దారుణంగా హత్యకు గురైన సంగతికి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ ఘటన అమెరికా తెలుగు వారిని భయానికి గురి చేసింది. ఫిబ్రవరి నెలలో కేన్సన్‌ నగరంలో ఉన్న ఆస్టిన్‌ బార్‌ అండ్‌ గ్రిల్‌లో ఈ ఘటన జరిగింది. అయితే ఇప్పుడు హంతకుడికి కఠినమైన శిక్ష పడే అవకాశం ఉంది. 52ఏళ్ల ఆడమ్‌ ప్యూరింటన్‌ శ్రీనివాస్‌ కనికరం లేకుండా నిందిస్తూ కాల్పులు జరిపాడు. మా దేశం నుండి వెళ్లిపోండి అంటూ జాత్యహంకారాన్ని చూపాడు.

ఆ కాల్పుల్లో భారత్ కు చెందిన వ్యక్తి అలాగే మరో అమెరికా యువకుడు కూడా గాయపడ్డారు. దీంతో అతనిపై పోలీసులు ఫస్ట్‌ డిగ్రీ హత్య కేసుతో పాటు ఫస్ట్‌ డిగ్రీ హత్యాయత్నం కేసును కూడా నమోదు చేశారు. అయితే మే 4న అతనికి కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. ఆడమ్‌ కు 12 ఏళ్ల నుంచి గరిష్టంగా 50 ఏళ్ల వరకు శిక్ష ఖరారు అవ్వచ్చని తెలుస్తోంది. ఈ విషయంపై శ్రీనివాస్ భార్య స్పందించారు. ఈ తీర్పు నా శ్రీనును తీసుకురాలేదు. కానీ జాతి విద్వేషం అనేది ఎప్పటికి సరైనది కాదని ఈ తీర్పు బలమైన సందేశాన్ని ఇస్తుందని ఆమె తెలియజేశారు.