రివ్యూ రాజా తీన్‌మార్ : మా అబ్బాయి – తుపాకి లెవెల్లో తీద్దామనుకున్నారు.. కానీ పేల్లేదు !

Friday, March 17th, 2017, 05:24:43 PM IST


తెరపై కనిపించిన వారు : శ్రీ విష్ణు, చిత్ర శుక్ల

కెప్టెన్ ఆఫ్ ‘మా అబ్బాయి’ : కుమార్ వట్టి

మూలకథ :

మంచి కుటుంబంతో ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవితం గడిపే యువకుడు (శ్రీ విష్ణు) తమ ఎదురింట్లో ఉండే అమ్మాయి (చిత్ర శుక్ల)ని ప్రేమిస్తాడు. ఇంకొద్దిరోజుల్లో పూర్తిగా సెట్టైపోతుంది అనుకునే అతని జీవితంలో ఒకరోజు ఊహించని ఘోరం జరుగుతుంది.

ఆ ఘోరం అతని లైఫ్ ను తలకిందులు చేస్తుంది. అలా తన జీవితం దుర్భరంగా తయారవడానికి కారకుల్ని చంపాలని నిర్ణయించుకుంటాడు శ్రీ విష్ణు. అసలు అతని జీవితం తలకిందులయ్యే ఆ సంఘటన ఏమిటి ? దాని వలన హీరో ఏం కోల్పోయాడు ? దానికి కారణమైన వారు ఎవరు ? వాళ్ళను ఎలా శిక్షించాడు ? అనేదే సినిమా కథ.

విజిల్ పోడు :
–> దర్శకుడు కుమార్ వట్టి తీసుకున్నది ఆర్డినరీ అంశమే అయినప్పటికీ దాన్ని ఒక కుటుంబానికి కనెక్ట్ చేసి కథ చెప్పడమనేది కాస్త ఇంప్రెసివ్ గా ఉంది. అలాగే హీరో పాత్ర చుట్టూ రాసిన సిస్టర్ సెంటిమెంట్ అల్లిన తీరు ఆకట్టుకుంది.

–> హీరోయిన్ చిత్ర శుక్ల సినిమా మొత్తం కనబడుతూ తన అండ చందాలతో కనువిందు చేసింది. రొమాంటిక్ సన్నివేశాల్లో బాగా నటించింది కూడా. ఆమెకు, సరే విష్ణుకు మధ్య లవ్ ట్రాక్ కాస్త బాగుంటుంది.

–> ఫస్టాఫ్, సెకాండాఫ్లలో హీరో తన శత్రువుల గురించి వెతికే కొన్ని సందర్భాల్లో ప్లే చేసిన టెక్నికల్ మైండ్ గేమ్ ఇంప్రెస్ చేసింది.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమా కథ నడుస్తున్న కొద్ది బరువుగా తయారై హీరో ఇమేజ్ ను దాటి వెళ్ళిపోయింది. దాంతో కథలో హీరో తేలిపోవడం చాలా చోట్ల తెలిసిపోయింది.

–> సినిమాలో ఆరు పాటలుండాలన్న నిబంధనతో వాటిని కథనం మధ్యలోకి తీసుకొచ్చి ఇరికిచ్చడం, పాట కావాలి అనుకున్నప్పుడు హీరోయిన్ ని తీసుకొచ్చి ఒక రొమాంటిక సన్నివేశం క్రియేట్ చేయడం బాగోలేదు.

–> సినిమా కథనం కాస్త సీరియస్ గా మారుతుంది, హీరో సిట్యుయేషన్ కాస్త కఠినంగా తయారవుతుంది అనుకునేలోపు ఏదో ఒక అవసరంలేని ఫ్యామిలీ డ్రామాను, రొమాంటిక్ సీన్ ను అడ్డుతగిలేలా పెట్టి ఆ ఉత్సాహం మొత్తాన్ని నీరుగార్చారు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..!

–> హైదరాబాద్లో ఉండే ఒక సాదా సీదా కుర్రాడు ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ని తన ఇంట్లోనే ఉంటూ ఆటాడుకోవడం, ఎక్కడా హీరోకి సమస్య అనేదే రాకపోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది.

–> క్రూర నేరగాళ్లు సిటీని అల్లకల్లోలం చేస్తుంటే పోలీసులు మాత్రం ఎక్కడా స్పందించకుపోవడం విడ్డూరమే మరి.

చివరగా సినిమా చూసియాన్ ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ: సినిమా ఏమంత గొప్పగా లేదు కదా..
మిస్టర్ బి : భారీ సబ్జెక్టును తీసుకుని చిన్న హీరో మీద వేస్తె ఇలానే ఉంటుంది.
మిస్టర్ ఏ: ‘తుపాకి’ రేంజ్ స్క్రీన్ ప్లే నడుపుదామనుకున్నాడు. అది కాస్త తుస్సుమంది.
మిస్టర్ బి : అందుకే ఇలాంటి కథలు రాసేప్పుడు హీరో ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకోవాలి.