దత్తత గ్రామానికి శ్రీమంతుడు.. ఎందుకంటే..?

Wednesday, March 16th, 2016, 12:49:15 PM IST


ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక.. సంసంద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అనే పధకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పధకం కింద మోడీతో పాటు ఎంపీలు కూడా గ్రామాలను దత్తత తీసుకున్నారు. అయితే, ఎంపీలతో పాటు రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు సైతం గ్రామాలను దత్తత తీసుకొన్న సంగతి తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ లో అనేకమంది సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకునే కథాంశంతో వచ్చిన శ్రీమంతుడు సినిమా విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం తరువాత చాలా మంది హీరోలు గ్రామాలను దత్తత తీసుకున్నారు.

ఇక ప్రిన్స్ మహేష్ బాబు కూడా అటు తెలంగాణలోని మెహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు మండలంలో ఉన్న సిద్దాపురం అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. కెటిఆర్ కోరిక మేరకు మహేష్ బాబు ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే, తెలంగాణలోనే కాకుండా మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ లో తన సొంత గ్రామం బుర్రిపాలెం ను దత్తత తీసుకున్నారు. బుర్రిపాలెం ను అభివృద్ధి చేస్తామని మహేష్ బాబు దత్తత తీసుకున్న తరువాత చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మహేష్ బాబు రేపు (గురువారం) బుర్రిపాలెం వెళ్తున్నారు. మహేష్ తో పాటు ఆయన సతీమణి, ఇద్దరు పిల్లలు, సోదరి పద్మావతి కూడా మహేష్ బాబుతో గ్రామానికి రానున్నది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు మహేష్ బాబు బుర్రిపాలెంలోనే ఉండి గ్రామంలో అభివృద్ధి చేయవలసిన పనుల గురించి అక్కడి అధికారులతో చర్చించనున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్లు, వీధి లైటింగ్ తదితర అంశాలపై మహేష్ బాబు దృష్టి సారించనున్నారు.