ఆయుర్వేదం ముసుగులో మద్యం చాక్లెట్లు, గంజాయి ఐస్ క్రీంలు…

Monday, April 16th, 2018, 10:48:41 AM IST

ఆధునిక సాంకేతికత, అడుగడుగునా నిఘా పెరుగడంతో మద్యం, గంజాయి మాఫియా తన పంథా మార్చుకుంది. ఎవరికీ అనుమానం రాకుండా చిన్నపిల్లలు తినే చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లను మద్యం, గంజాయితో తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఆయుర్వేద ఔషధాల ముసుగులో సైతం విక్రయిస్తూ ప్రజలను మత్తుకు బానిసలను చేస్తున్నది. హైదరాబాద్‌లో ఇటీవల ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు జరిపిన దాడుల్లో వెలుగు చూసిన ఆశ్చర్యగోలిపే వాస్తవాలు ఇవి.

హైదరాబాద్‌లోని లోయర్ ధూల్‌పేట, టక్కర్‌వాడీకి చెందిన బ్రిజ్‌రాజ్‌సింగ్ బీహార్ నుంచి గంజాయితో తయారుచేసిన మత్తు చాక్లెట్లను తీసుకొచ్చి స్థానికంగా విక్రయిస్తుండగా ఆబ్కారీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వీటిని టైగర్ ఆయుర్వేద చాక్లెట్స్ లేబుల్‌తో ప్యాక్‌చేసి విక్రయిస్తుండడంతో ఎవరికీ అనుమానం రావడం లేదు. వీటిని కాలేజీలు, స్కూల్ విద్యార్థులు కొని మత్తులో మట్టుకి బానిసవుతున్నారు. మల్లేపల్లిలోని చాక్లెట్ హబ్‌లో మద్యంతో తయారుచేస్తున్న చాక్లెట్లను ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు గుర్తించగా, ఇక్కడ 380 రకాల బ్రాండ్ల పేరుతో చాక్లెట్లు లభ్యమయ్యాయి. రమ్ చాక్లెట్స్, ఎస్‌డబ్ల్యూ, రమ్ ర్యాట్స్, బ్లాక్ కరెంట్, రమ్ రైజింగ్, స్కాచ్ చాక్లెట్స్, టీచర్స్ చాక్లెట్, విస్కీ చాక్లెట్ పేర్లతో తయారుచేస్తున్నారు. వీటిని పరీక్షల కోసం ల్యాబ్ కు తరలించారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకోనున్నారు. ఈ దాడుల్లో ఏడు మద్యం బాటిళ్లు కూడా లభించడం మరింత అనుమానాస్పదంగా కనిపిస్తున్నది.

పట్టణంలోని బడా షాపింగ్ మాల్స్‌లో సైతం లిక్కర్ చాక్లెట్లు విక్రయిస్తున్నట్టు అధికారులకిఉ సమాచారం వచ్చింది. వరంగల్, కరీంగనర్, సంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని షాపింగ్‌మాల్స్‌తోపాటు, ఏపీలోనూ ఈ ఈ మత్తు పదార్థాల వ్యాపారం విరివిగా సాగుతున్నట్టు తెలిసింది. వీటి ధర రూ.50-100 ఉంటున్నది. లిక్కర్ చాక్లెట్లు మద్యం బాటిల్‌ను పోలినట్టుగా పొడవుగా ఉంటాయి. వీటి పైపొర గట్టిగా ఉంటుంది. కొరికితే మధ్యలో ఉన్న మద్యం బయటికి వచ్చేలా చాక్లెట్లను తయారు చేస్తున్నారు. సాధారణ చాక్లెట్ల కంటే అమితంగా ఆకట్టుకునేలా, చూడగానే గుర్తించేలా మద్యం సీసాను పోలి ఉండే డిజైన్‌ను దీని తయారీకి ఎంచుకున్నారు. మరికొందరు గంజాయిని పొడిగా చేసి చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్‌లో కలిపి అమ్ముతున్నారు. మరికొన్ని ముఠాలు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లో ఎల్‌ఎస్‌డీ బ్లాస్ట్ డ్రగ్‌ను పెట్టి విక్రయిస్తున్నాయి. కొన్ని రకాల డ్రగ్స్‌ను నగరంలోనే తయారుచేస్తుండగా మరికొన్నింటిని గోవా, బీహార్ నుంచి తీసుకు వచ్చి అమ్ముతున్నారు. మళ్ళీ ఎక్కడా తేడా రాకుండా నిజమైన చాకేల్ట్లను , ఐస్ క్రీమ్లను పోలి ఉండేలా తయారు చేయడం వాళ్ళ ఎవరికీ అనుమానం రాకుండా వ్యాపారం కొనసాగిస్తున్నారు.