సిద్ధాంతాల మాటున ఉన్మాదుల్లా మారిన మావోలు!

Monday, September 24th, 2018, 02:39:37 PM IST

హక్కుల కోసమే మా పోరాటం, సమసమాజ స్థాపనే మా ధ్యేయం అంటూ చెప్పుకునే మావోలు చేసిన నిన్నటి చర్య వారి సిద్ధాంతాలనే ప్రశ్నిస్తోంది. ఏకంగా ప్రజాప్రతినిధి, అరకు టీడీపీ ఎంఎల్ఏ సర్వేసరావును, మాజీ ఎంఎల్ఏ సివేరి సోమను హతమార్చడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మన్యం ప్రాంతంలో తమకు ఇంకా పట్టు ఉందని, ఉనికి చాటుకోవడం కోసమే చేశారని చెప్పబడుతున్న ఈ హత్యాకాండను మావో సానుభూతిపరులు సైతం వెనకేసుకుని రాలేకపోతున్నారు.

మావోలకు ఉనికి చాటుకోవాలంటే చాలానే దారులున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో తమ సంఖ్యా బలాన్ని తెలిపేలా భారీ సభలు నిర్వహించడం, ఇంకా దూకుడుగా వెళ్లాలంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ఉండనే ఉన్నాయి. కానీ ఇలా ఇద్దరు నిరాయుధులైన రాజకీయ నాయకుల్ని చుట్టుముట్టి అతి సమీపం నుండి కాల్పులు జరిపి చంపడమనేది ఏ కోశానా సాహసోపేతమైన చర్య అనిపించుకోదు.

మేధావులు సైతం సిద్ధాంతాల ముసుగులో మావోయిజం ఏనాడో ప్రతీకార చర్యగా రూపాంతరం చెందిందని, దానికి ఈ తాజా ఘటనే నిదర్శనమని, ఉనికి చాటుకోవాలంటే హత్యలు చేయాల్సిన అవసరం లేదని, ఇలానే కొనసాగితే ప్రజల్లో మావోల పట్ల ఉన్న కాస్త సానుభూతి, గౌరవం కూడ అడుగంటిపోతాయని అంటున్నారు. మరి పూర్తిగా దారి తప్పిన తమ ఉద్యమాన్ని గాడిన పెట్టుకుంటారో లేకపోతే ఇలానే కొనసాగించి చివరకు ఉన్మాదుల్లా మిగిలిపోతారో మావో నాయకులే తేల్చుకోవాలి.