ఆటోలో వచ్చినందుకు ఎమ్మెల్యేను గెంటేశారు!

Saturday, April 11th, 2015, 11:50:48 AM IST


మనదేశంలో రాజకీయ నాయకులంటే ఆ హోదానే వేరు. కాగా ఏదైనా పార్టీ కార్యకర్తగా ఉంటేనే వెనకాల మంది మాల్బలంతో హోదాను చూపించే ఈ రోజుల్లో ఆటోలో వచ్చినందుకు సచివాలయం సాక్షిగా ఒక ఎమ్మెల్యేకు ఘోర పరాభవం ఎదురైంది. ఇక వివరాలలోకి వెళితే ఖమ్మం జిల్లా భద్రాచలం సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు గురువారం సెక్రటేరియట్ లో చేదు అనుభవం ఎదురైంది. కాగా తన నియోజకవర్గంలో ఒక పని మీద సచివాలయానికి అటోలో వచ్చిన రాజయ్యను సచివాలయ భద్రతా సిబ్బంది లోపలి రాకుండా బయటకు గెంటేశారు.

దీనితో ఆయనతో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా ఆయన ఎమ్మెల్యేనే అని చెప్పినప్పటికీ సదరు సెక్యూరిటీ ఆ మాటలను పట్టించుకోలేదు. అలాగే అంతటితో ఆగకుండా నువ్వు ఎమ్మెల్యేవా? అయితే కారు ఏది? గన్ మెన్ లు ఏరి? అంటూ ప్రశ్నలతో విసిగించారుట. ఇక చేసేది లేక రాజయ్య తన ఐడి కార్డును వారికి చూపించి సచివాలయంలోకి నడుచుకుంటూ వెళ్ళారుట. కాగా ఎమెల్యేలు అంటే కార్లు, గన్ మెన్ లతో హడావిడిగా ఉంటేనే గుర్తించే రోజులు ప్రస్తుతం దాపురించాయి. అలాగే అసెంబ్లీలో పెద్దగా మాట్లాడుతూ, మైక్ లు విరగొట్టి, అశ్లీల పడజాలలను వాడే ఎమ్మెల్యేలకైతే హీరోల కన్నా అధిక పాపులారిటీ, గుర్తింపు ఉన్నాయనడంతో అతిశయోక్తి లేదు. ఇక సామాన్యులతో మమేకమై, ప్రజల మధ్య సాధారణ జీవితం గడిపే రాజయ్య లాంటి ఎమ్మెల్యేలను చూసి ప్రజలు గుర్తు పడతారని ఆశించడం పొరపాటే మరి.