గుప్త నిధులకోసం నరబలి చేయాలని చూసారు…

Monday, March 5th, 2018, 09:30:32 AM IST

దేశంలో సాంప్రదాయానికీ సైన్సుకి మధ్య అంతు చిక్కలేనన్ని అక్రమాలు. క్షుద్రపూజలూ, మంత్ర తంత్రాలు, నరబలుల బాటన పది గుప్త నిధుల త్రవ్వకాల యత్నంలో పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామ శివారులోని మానేరు నది ఒడ్డున సుంకరి కోటల్లో గుప్తనిధుల కోసం కొందరు వ్యక్తులు ఓ బాలుడిని నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించారు. తనని చంపటానికి ప్రయత్నిస్తున్నారన్న విషయం గమనించిన ఈ బాలుడు ఆ క్రురుల కండ్లుకప్పి గ్రామానికి తప్పించుకుని పారిపోయి గ్రామస్తులకు విషయాన్ని అందించడంతో స్థానికులు దుండగులను పట్టుకుని కర్ర దెబ్బలతో కళ్యాణం చేసి పోలీసులకు పట్టించారు. గ్రామ ప్రజలు, పోలీసులు వివరాల ప్రకారం.. కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన సాగర్ల రవి తన పొలానికి మోటర్ పెట్టి వద్దామని అదే గ్రామానికి చెందిన గాదర్ల రమేశ్ను శనివారం రాత్రి తన వెంట పొలం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి తన బావ పొలానికి అని చెప్పి మానేరు నది ఒడ్డున సుంకరి కోటల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ మద్యం బాటిళ్లతో కొంతమంది గాదర్ల రమేశ్‌కు మద్యం తాగించారు. మరికొంత తాగాలని ఒత్తిడి చేశారు.
ఇదిలా ఉండగా అక్కడ గుప్తనిధుల కోసం తవ్విన గోతి, అక్కడ ఉన్న పలుగు గడ్డపార, ఇతర పూజ సామగ్రి చూసిన రమేశ్, తనను బలి ఇచ్చేందుకు తీసుకువచ్చారని గుర్తించి అక్కడి నుంచి తప్పించుకొని మొదట మొట్లపల్లికి చేరుకున్నాడు. అక్కడి నుంచి కిష్టంపేటకు చేరుకొని, జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. గ్రామస్థులు సుంకరి కోటల వద్దకు బయలుదేరగా, మొట్లపల్లి గ్రామంలోని ఓ ఓ పొలం వద్ద గుడిసెలో ఉన్న దుండగులను పట్టుకొని. వారిని కిష్టంపేటకు తీసుకొచ్చి, దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సూర్యాపేట జిల్లా మోటంపల్లికి చెందిన గోళి ప్రేంకుమార్‌రెడ్డి, కిష్టంపేటకు చెందిన సాగర్ల రవి, పెగడపల్లికి చెందిన చలిగంటి రాజెళ్లుపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పరారీలోఉన్న మరో నలుగురికి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్టు వెల్లడించారు.