మోడీ స్టాండ్ బై విమానంలో గ్రైనేడ్

Saturday, October 4th, 2014, 12:44:58 PM IST


ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే మోడీ అమెరికా పర్యటన కోసం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 747-400 విమానాన్ని స్టాండ్ బై విమానంగా ఉంచారు. కాగా తాజాగా ఆ విమానంలో గ్రైనేడ్ లభ్యమవడంతో భద్రతా బలగాల్లో కలకలం నెలకొంది. వివరాలలోకి వెళితే మోడీ అమెరికా పర్యటన కోసం ఎయిర్ ఇండియా విమానాన్ని స్టాండ్ బై గా ఉంచారు. అయితే మోడీ పర్యటన ముగియడంతో ఆ విమానాన్ని ముంబై-హైదరాబాద్-జెద్దాల మధ్య ప్రయాణికుల సేవలకు ఉపయోగిస్తున్నారు.

కాగా శుక్రవారం రాత్రి ఆ విమానం ప్రయాణికులతో జెద్దా వెళ్ళింది. అయితే జెద్దాలో ల్యాండ్ అయిన అనంతరం ప్రయాణికులంతా దిగిపోయాక, విమానంలో బిజినెస్ క్లాసు కుర్చీల కింద ఒక గ్రెనైడ్ సిబ్బంది కంటబడింది. కాగా ఈ విషయాన్ని వెంటనే సదరు సిబ్బంది భారత్ లోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. దీనితో వెంటనే అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించి, విచారణ పూర్తయ్యే వరకు విమానాన్ని కదలనీయ వద్దని విమాన సిబ్బందికి సూచించారు. అయితే సెప్టెంబర్ 22,27 తేదీల్లో ఎస్ఎస్ జీ కమెండోలు విమానాశ్రయాల్లో కసరత్తులు చేశారని ఈ క్రమంలోనే గ్రైనేడ్ అక్కడికి వచ్చి ఉంటుందని వైమానిక వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.