వైరల్ గా మారిన పట్టపగలు మర్డర్!

Thursday, April 5th, 2018, 04:48:55 PM IST

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలు అదుపుకు ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ రోజు ఎక్కడో ఒకచోట ఇటువంటి దోపిడీలు, దొంగతనాల బారినపడి కొందరు నష్టపోతున్నారు. సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం జరిగిన ఒక సంఘటన ఆ ప్రాంతవాసులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తోంది. సూర్యాపేట జిల్లాలోని కోదాడ బాలాజీనగర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పట్టపగలు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై వున్నట్లుండి ఇంట్లోకి ప్రవేశించిన కొందరు దుండగులు కత్తితో దాడి చేశారు. దాడి అనంతరం ఇంట్లోని 7 తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు.

అయితే దుండగుల దాడిలో గాయపడిన బాధిత మహిళ బర్మావత్ లక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే పట్టపగలే ఇంతటి దారుణం జరగడంతో పోలీస్ లు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి భద్రత చెర్యలు చేపట్టాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు….