అఖిల్ సినిమాకి ఎంపీ కవిత సహనిర్మాత?

Wednesday, February 4th, 2015, 11:25:18 PM IST


తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో పోరాటం చేసి ఇప్పుడు రాజకీయరంగంలో దూసుకేళుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తాజాగా కవిత సినీరంగంలో కూడా అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ఇక వివరాలలోకి వెళితే ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున రెండవ కుమారుడు అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రానికి మరో టాలీవుడ్ హీరో నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఎంపీ కవిత ఆ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు సినీవర్గాలు గుసగుసలాడుతున్నాయి.

అయితే కొన్ని నెలల క్రితం ఎన్ కన్వెన్షన్ సెంటర్ తగాదా నేపధ్యంలో కెసిఆర్ కు నాగార్జునకు మధ్య కాస్త దూరం పెరగడంతో ఇప్పుడు అఖిల్ చిత్రానికి కవిత సహా నిర్మాతగా వ్యవహరించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా హీరో నితిన్ కుటుంబానికి కెసిఆర్ కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాలే కవిత సినీ రంగప్రవేశానికి దారి తీసినట్లుగా సినీ వర్గాలలో టాక్ నడుస్తున్నట్లు సమాచారం.