మూవీ రివ్యూ : మిస్టర్ మజ్ను

Friday, January 25th, 2019, 04:00:20 PM IST

 

ప్రస్తుతం ఉన్న యువ హీరోల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సరైన హిట్ దొరకాల్సిన హీరోల్లో అక్కినేని వారసుడు అఖిల్ కూడా ఒకరు.అలాగే తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఇప్పుడు అఖిల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించికోడానికి బాక్సాఫీక్ దగ్గరకి వచ్చారు..మరి వెంకీ అట్లూరి అయినా అఖిల్ కు సరైన హిట్ ఇచ్చారో లేదో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి చూద్దాం రండి..

కథ :

కథలోకి వెళ్లినట్టయితే హీరో అఖిల్(విక్కీ) ఎలాంటి అమ్మాయిల చూపునైనా తనవైపు తిప్పుకునే రొమాంటిక్ యంగ్ బాయ్ గా కనిపిస్తాడు.తన శైలికి తగ్గట్టుగానే హీరోయిన్ నిధి అగర్వాల్(నిక్కీ)కి కూడా దగ్గరవ్వాలనుకుంటాడు.అలా నిధీని తనవైపు తిప్పుకునే క్రమంలో ఆమెతో ప్రేమలో పడతాడు.ఆ తర్వాత కొన్ని అనుకోని సంఘటనల వలన ఇద్దరు విడిపోతారు.దానితో అఖిల్ మళ్ళీ నిధీ ప్రేమను దక్కించుకున్నాడా..?ఆ సమయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు.నిధి అఖిల్ ప్రేమను తిరిగి అంగీకరించిందా అన్నది తెలుసుకోవాలి అంటే వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

సినిమా స్టార్ట్ అవ్వడమే లండన్ లో మొదలవుతుంది.అప్పటికే ఒకసారి అక్కినేని వారసుడు నాగచైతన్య తో జతకట్టిన నిధి అగర్వాల్ ఈ సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది.ఇక టాలీవుడ్ లో రొమాన్స్ కి పెట్టింది పేరు నాగార్జున.అందుకు తగ్గట్టుగానే అఖిల్ కూడా ఈ సినిమాలో తన రొమాంటిక్ యాంగిల్ తో ఆకట్టుకుంటాడు.అలాగే ఫస్టాఫ్ లో వచ్చే టైటిల్ సాంగ్ లో అఖిల్ యొక్క ఎనిమిది పలకల దేహంతో కనిపించే సీన్లు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తాయి.అక్కడక్కడా కొన్ని హాస్య సన్నివేశాలు,రొటీన్ ఎమోషనల్ సీన్స్ తప్ప ఫస్టాఫ్ పెద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదు.వెంకీ ఈ విషయంలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే బాగున్ను.దానికి తోడు సినిమా చూసే ప్రేక్షకునికి ఫస్టాఫ్ చూసే వరకు కథలోకి వెళ్లినట్టు కూడా అనిపించదు.

ఇక థమన్ పనితనానికి వచ్చినట్టయితే అరవింద సమేత సినిమా నుంచి థమన్ తనని తాను రోజురోజుకి కొత్తగా మలచుకుంటున్నారు.అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా సంగీతం కూడా ఫ్రెష్ గా అనిపిస్తుంది.కొన్ని పాటల్లో ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించిన జార్జ్ సి విలియమ్స్ యొక్క కెమెరా పనితనం కూడా బాగానే ఉంది.జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది కూడా తనదైన మార్క్ కామెడీతో ఆకట్టుకుంటారు.ఇక సెకండాఫ్ కి వచ్చినట్టయితే ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ పర్వాలేదనిపిస్తుంది.హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి.అలాగే ఆ సీన్లలో అఖిల్ నటనలో కూడా మంచి పరిణితి కనిపిస్తుంది.అదే విధంగా హీరోయిన్ నిధి కూడా మరో సారి తన నటనతో ఆకట్టుకుంది.ఇక మిగతా పాత్రల్లో కనిపించిన నాగబాబు,రావు రమేష్ మరియు సుబ్బరాజు తదితరులు వారి పాత్రలకి సరైన న్యాయం చేకూర్చారు. కానీ దర్శకుని విషయానికి వచ్చినట్టయితే తొలిప్రేమ లాంటి భిన్నమైన సినిమా తీసిన తర్వాత వెంకీ అట్లూరికి ఇది రెండో సినిమా కావడంతో దానిలానే ఏదైనా కొత్తదనం చూపిస్తాడు అనుకున్నవారి ఆలోచనలను వెంకీ పూర్తిగా తలకిందులు చేశారనే చెప్పాలి.హీరో లుక్స్ పై పెట్టిన శ్రద్ధ దర్శకుడు కథనం పై కూడా ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే ఇంకా బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

అఖిల్ లుక్స్
హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ
థమన్ సంగీతం

మైనస్ పాయింట్స్ :

పేలవమైన కథ
సాగదీతగా సాగే ఫస్టాఫ్
ఆకట్టుకోని కథనం

తీర్పు :

ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే దర్శకుడు వెంకీ అట్లూరి అఖిల్ ల కాంబినేషన్లో వచ్చిన “మిస్టర్ మజ్ను” ఫస్టాఫ్ కి సెకండాఫ్ కి పెద్ద తేడా అయితే కనిపించదు.దర్శకుడు వెంకీ అట్లూరి రాసుకున్న కథ తెరకెక్కించడంలో కాస్త విఫలమయ్యారనే చెప్పాలి. సినిమా ఓ మోస్తరుగా పర్వాలేదనిపించినా A సెంటర్ ఆడియెన్స్ ని ఓ మాదిరిగా ఆకట్టుకుంటుంది,కానీ B, C సెంటర్ ఆడియెన్స్ ని మాత్రం ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.మొత్తానికి ఈ వారాంతానికి కుటుంబంతో ఒకసారి చూడొచ్చు.

Rating : 3/5