దీక్ష విరమించిన ముద్రగడ పద్మనాభం

Sunday, February 7th, 2016, 02:37:22 PM IST


కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు దీక్ష విరమించారు. 5వ తేదీ నుండి వరుసగా మూడు రోజులు నిరాహార దీక్ష చేసిన ఆయనతో ఈరోజు ప్రభుత్వ ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలమై దీక్ష విరమించారు. ప్రభుత్వ ప్రతినిధులుగా కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, తోట త్రిమూర్తులు, బొద్దు భాస్కర రామారావు తూర్పు గోదావరి కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి స్వయంగా వెళ్లి సుమారు గంటపాటు చర్చలు జరిపి ఆయన్ను బుజ్జగించి.. దీక్ష విరమింపజేశారు.

రిజర్వేషన్ విషయమై వేసిన కమీషన్ కు ఇంకా 7 నెలలే గడువుందని.. ప్రస్తుతం కాపు కార్పోరేషన్ కు 500 కోట్లు ఇస్తామని.. అలాగే ప్రతి బడ్జెట్ లో కాపుల అభివృద్దికి 1000 కోట్లు కేటాయిస్తామని తెలిపాక ఆయన దీక్ష విరమించడానికి ఒప్పుకున్నారు. భాస్కర రామారావు ఆయనకు నిమ్మరసం తాపించి దీక్ష విరమిస్తున్నట్లుగా ప్రకటించారు.