షాకింగ్ న్యూస్ : భార్యను ఇంట్లోనే పూడ్చి పెట్టి… బయట టూ లెట్ బోర్డు వేసాడు

Thursday, April 26th, 2018, 06:39:12 PM IST

షార్జాలోని ఓ ఇంట్లో భారత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రతీ రోజూ తనతో ఫోన్‌లో మాట్లాడే సోదరి (చనిపోయిన మహిళ) ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె సోదరుడు ఏప్రిల్ 9న ఆమెను కలిసేందుకు భారత్ నుంచి షార్జాకు వచ్చాడు. అయితే తన సోదరి కనిపించకపోవడంతో అనుమానమొచ్చిన అతడు దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షార్జా మేసెలూన్ ఏరియాలోని సదరు మహిళ మృతదేహం ఆమె ఇంట్లోనే పూడ్చిపెట్టబడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న దుబాయ్ పోలీసులు మహిళను ఆమె భర్త చంపి ఉంటాడని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. కేరళకు చెందిన నిందితుడు తన భార్యను చంపి ఇంట్లో పూడ్చి పెట్టిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి భారత్‌కు పారిపోయేందుకు ప్రయత్నించినట్లుగా భావిస్తున్నారు. మహిళను పూడ్చిపెట్టి వెళ్లేటపుడు ఆ ఇంటికి అద్దెకివ్వబడును అనే బోర్టు తగిలించినట్లు పోలీసులు తెలిపారు.

పబ్లిక్ ప్రాసిక్యూషన్ అనుమతి తీసుకున్న తర్వాత ఆ ఇంటికి వెళ్లి పరిశీలించాం. బిల్డింగ్ ఫ్లోర్‌లో కొన్ని పింగాణి పలకలు లేకపోవడంతో..స్నిఫర్ డాగ్స్ సాయంతో తనిఖీలు చేయగా..మహిళ మృతదేహం పూడ్చిపెట్టబడి ఉన్నట్లు గుర్తించామని షార్జా పోలీస్ చీఫ్ సైఫ్ అలీ జిరి అల్ షంసి వెల్లడించారు. కుళ్లిపోయి ఉన్న డెడ్‌బాడీని అటాప్సీ కోసం ఫోరెన్సిక్ లాబోరేటరీకి తరలించామన్నారు. నిందితుడికి అప్పటికే ఇద్దరు భార్యలున్నారని, వారిలో ఒకరిని భారత్‌కు పంపిచాడని చెప్పారు. వేలిముద్రలు, ఐరిష్ స్కాన్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్‌వారెంట్ జారీచేసినట్లు వెల్లడించారు.