‘రివ్యూ రాజా’ తీన్‌మార్ : నాగభరణం – బాబోయ్ ఇదేంటిదీ..!!

Friday, October 14th, 2016, 03:42:37 PM IST


తెరపై కనిపించిన వారు : రమ్య, దిగంత్, విష్ణువర్ధన్
కెప్టెన్ ఆఫ్ ‘నాగభరణం’ : కోడి రామకృష్ణ

మూలకథ :

దేవుళ్ళు తమ శక్తిని కోల్పోయే సూర్య గ్రహణం రోజున ఈ ప్రపంచాన్ని దుష్ట శక్తుల నుండి కాపాడేది ఒక్క శక్తి కవచమే! ఆ శక్తి కవచాన్ని గత జన్మలో జారవిడిచిన నాగమ్మ (రమ్య), మరో జన్మెత్తి మళ్ళీ దాన్ని తిరిగి అదే స్థానానికి ఎలా తీసుకెళ్ళింది? ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్ళేంటీ? అన్నదే సినిమా.

విజిల్ పోడు :

1. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఆ విజువల్ ఎఫెక్ట్స్‌తో దివంగత సూపర్‌స్టార్‌ విష్ణువర్ధన్‌ను ఆవిష్కరించడం కూడా గొప్ప విషయమే! కన్నడ అభిమానులకు ఆయన ప్రెజెన్స్ విజిల్స్ వేయిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు విష్ణు వర్ధన్ తెలియకపోయినా, గ్రాఫిక్స్‌లో అలా ఒక మనిషిని ఆవిష్కరించడం గొప్ప విషయంగానే కనిపిస్తుంది.

2. రమ్య చూడడానికి బాగుంటుంది. ఈ సినిమాలో ఆమె ఇటు అందంతో, నటనతో బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా కథంతా తన చుట్టూనే తిరిగేదే కావడం, అందులో ఆమె ఒదిగిపోయి నటించడం చూసి రమ్యకు విజిల్స్ వేసుకోవచ్చు.

3. సాయికుమార్ కనిపించేది ఒక్క సన్నివేశంలోనే అయినా, ఆయన తన ప్రెజెన్స్‌ను చాటుకున్నారు. ఆయన చెప్పే డైలాగులు, ఆయన కూతురుగా ఒక చిన్నమ్మాయి చేసే ఫైట్ విజిల్స్ వేయిస్తాయి.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

1. సినిమాలో కథ, కథనాలంటూ ఒకటి లేకపోవడమే పెద్ద ఢమ్మాల్‌గా చెప్పాలి. చిన్న పాయింట్‌ను పట్టుకొని, దానికి ఒక కథలేక సినిమాను లాగారు చూడూ.. విసుగుతో బయటకు పారిపోయేలా ఉన్నాయి, కొన్ని సన్నివేశాలైతే!

2. ఒక విలన్‌ ఉన్నాడు. అతడి ఓవరాక్షన్ చూస్తే అయితే ఇది జోకర్ రోలా? విలన్ రోలా? అనిపించక మానదు. ఎలా డిజైన్ చేశారో తెలియదు కానీ, తలనొప్పి తెప్పించేలా ఓవరాక్షన్ చేసి సినిమాను చాలాచోట్ల ఢమ్మాల్ అనిపించడానికి కారణమయ్యాడు.

3. ఫస్టాఫ్‌కి అయితే ఒక దండం పెట్టాలి. సెకండాఫ్ అటో, ఇటో పర్లేదు కానీ, ఈ ఫస్టాఫ్ అయితే ఆ మ్యూజిక్ కాంపిటీషన్ అంటూ, అందులో గెలిస్తే శక్తి కవచంని కప్పుగా గెలవొచ్చంటూ అదో పెద్ద కలలా నడిపించారు. ఇది ఢమ్మాల్‌కే ఢమ్మాల్!

దావుడా – ఈ సిత్రాలు చూశారూ ..!!

–> పురాతన కాలానికి సంబంధించిన ఒక విలువైన వస్తువుని, ఎవ్వరైనా ఒక మ్యూజిక్ కాంపిటీషన్‌లో కప్పుగా పెడతారా? అదీ ప్రభుత్వ ఆధీనంలో, మ్యూజియంలో ఉన్న వస్తువుని. ఇదైతే చిత్రమే!

–> ఎలా తెలుస్తుందో తెలియదు కానీ, ప్రపంచానికి తెలియని శక్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, విలన్‌కి మాత్రం భలే తెలుస్తుంటుంది. ఇందులో విలన్ శక్తి కవచం కోసం వెతకడం కూడా అలాగే ఉంటుంది. ఇది చిత్రాల్లో చిత్రమే!

–> చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఏ : బాబోయ్ ఇదేంటిదీ.. సినిమా ఇలా ఉందీ..!?
మిస్టర్ బీ : కట్టిపడేసి కొట్టినట్లనిపించింది నాకైతే..!!
మిస్టర్ ఏ : (సైలెంట్)