‘రివ్యూ రాజా’ తీన్‌మార్ : నరుడా డోనరుడా – ‘వీర్యదానం’ సగంలో ఆపేశాడు..!

Friday, November 4th, 2016, 07:32:08 PM IST
తెరపై కనిపించిన వారు : సుమంత్, పల్లవి సుభాష్, తనికెళ్ళ భరణి..
కెప్టెన్ ఆఫ్ ‘నరుడా డోనరుడా’ : మల్లిక్ రామ్
మూలకథ :
అల్లరి చిల్లరిగా తిరిగే విక్కీ (సుమంత్)కి ఆంజనేయులు (తనికెళ్ళ భరణి) అనే ఓ డాక్టర్ పరిచయమవుతాడు. విక్కీని స్పెర్మ్ డోనార్‌గా పనిచేయించడం కోసం చాలా కష్టపడి ఆంజనేయులు అతడ్ని ఒప్పిస్తాడు. విక్కీ చేసే వీర్యదానాన్ని వాడుకొని ఇద్దరూ బాగా సంపాదిస్తారు. ఆ తర్వాత ఈ పని వల్లే విక్కీ జీవితంలో కొన్ని అనుకోని మలుపులు తిరిగి అతడి జీవితమే అస్థవ్యస్తం అవుతుంది. అవేంటీ? ఈ కథ ఎక్కడికి చేరుతుందన్నదే సినిమా.
విజిల్ పోడు :
1. తనికెళ్ళ భరణి కామెడీకి విజిల్స్ వేస్తూనే పోవచ్చు. ముఖ్యంగా ఆయన టైమింగ్‌తో చెప్పే డైలాగులైతే మామూలుగా లేవు. ఇలాంటి ఒక పాత్రను ఎక్కడా తడబడకుండా, చాలా తెలివిగా ఆయన చేసిన విధానం కట్టిపడేసిందనే చెప్పాలి.
2. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన విక్కీ డోనార్‌కి రీమేక్ ఈ సినిమా. ఆ సినిమాలో అసలు కథను ఎక్కడా మార్చకుండా అలాగే తీసుకోవడం బాగుంది. ఇలాంటి ఒక విచిత్రమైన ఎంటర్‌టైనింగ్ కాన్సెప్ట్‌ను తెలుగులో చూడడం కొత్తే, దీనికీ విజిల్స్ వేసుకోవచ్చు.
3. క్లైమాక్స్ ఎంత ఎమోషనల్‌గా ఉంటుందంటే, ఇలా చూస్తూ కనెక్ట్ అయిపోతాం. దీనికీ విజిల్స్ వేసుకోవచ్చు.
ఢమ్మాల్ – డుమ్మీల్ :
1. విక్కీ డోనార్ కథను అలా తీసుకున్నారన్న మాటే గానీ, అందులోని ఫీల్, అసలైన ఎమోషన్‌ను మాత్రం గాలికొదిలేశారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఈ ఎమోషనే లేకపోవడం నిరుత్సాహపరిచింది.
2. ఇక సుమంత్ ఎందుకో కామెడీ చేసినా అదంతా సహజంగా కనిపించలేదు. కావాలని బలవంతంగా నటించినట్లు సుమంత్ కనిపించాడు. పల్లవి సుభాష్ అయితే అస్సలు కొద్దిగైనా యాక్టింగ్ చేస్తుందా అంటే మచ్చుకైనా అలా కనిపించలేదు.
3. హీరోయిన్ తండ్రి బెంగాలీ అవ్వడం ఏంటో గానీ, ఆ క్యారెక్టర్ చేసే ఓవర్ యాక్షన్‌ని తట్టుకోలేం. ఆ సాగదీసి చెప్పే డైలాగులు, ఓవర్ ఎక్స్‌ప్రెషన్సూ అదంతా పెద్ద గందరగోళం వ్యవహారం అనిపించక మానదు.
దావుడా – ఈ సిత్రాలు చూశారూ ..!!
–> సెకండాఫ్‌లో హీరోయిన్ చుట్టూ కథ తిరుగుతుంది. ఆ సమయంలో హీరోయిన్ సినిమానంతా తన చేతుల్లోకి తీసుకొని డామినేట్ చేయాలి. ఇక్కడేమో హీరోయిన్ నీరసంగా నటించేసి దేవుడా ఇదేం సిత్రం అనిపించేలా చేసింది.
–> విక్కీ విపరీతంగా డబ్బులు సంపాదిస్తూ ఉంటూంటే అతడి కుటుంబంలో ఎవ్వరైనా ఏం బిజినెస్ చేస్తున్నావని కూడా కనుక్కోకపోవడం విచిత్రంగానే కనిపించింది.
–> చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల సంభాషణ ఇలా ఉంది..
మిస్టర్ ఏ : ఆ వీర్యదానం చేయడం ఏంట్రా బాబూ.. కొత్తగా భలే ఉంది ఫస్టాఫ్!
మిస్టర్ బీ : అదే.. అక్కడే ఆపెయ్.. ఫస్టాఫ్ వరకేగా బాగుంది!!
మిస్టర్ ఏ : (సైలెంట్)