100 రోజుల పాలన అట్టర్ ఫ్లాప్

Monday, September 15th, 2014, 04:54:50 PM IST

chandra-babu-naidu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు వంద రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రుణమాఫీ పేరుతో రైతులకు సీఎం చంద్రబాబు టోపి పెట్టారని ఆంధ్రప్రదేశ్ పీపీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. చంద్రబాబు వంద రోజుల పాలనపై పీసీసీ తయారుచేసిన వాస్తవపత్రాన్ని విడుదల చేశారు. చంద్రబాబు వందరోజుల పాలనలో 101 అబద్ధాలు ఆడారని ఆరోపించారు. వందరోజుల్లో సిమెంట్ ధర 100 పెంచారని గుర్తు చేశారు. మంత్రివర్గంలో పెట్టుబడిదారలకే చోటు కల్పించారని అన్నారు.

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య వెన్నుపోటు అని పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. వందరోజుల పాలనలో చంద్రబాబు మాట తప్పారన్నారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజా సంక్షేమ ప్రభుత్వం కాదని, ప్రజావంచన ప్రభుత్వంలా ఉందని మండిపడ్డారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన ఘనత చంద్రబాబుదన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించారని దుయ్యబట్టారు. చంద్రబాబు వచ్చాక ఉద్యోగాలు పోయాయని బొత్స చెప్పారు.

వందరోజుల పాలనపై వైఎస్ఆర్ సీపీ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబు వంద రోజుల సినిమా ఫ్లాపయినా హిట్ అయిందని సంబరాలు జరుపుకోవటం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు. బాబు వందరోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఘనతను చంద్రబాబు తన ఖాతలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో బాబు 200 వాగ్ధానాలు చేశారని, పాదయాత్రలో మరో 300 వాగ్దానాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటిదాకా చంద్రబాబు ఒక్క వాగ్దానాన్నీ కూడా నెరవేర్చలేదన్నారు. ఇప్పటిదాకా ఏ ఒక్క రైతుకు రుణమాఫీ కాలేదన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ఎక్కడైనా అమలయిందా అని ప్రశ్నించారు. 2 రూపాయలకే మినరల్ వాటర్ ఎవరైనా ఇప్పటిదాకా తాగారా అన్నారు.

సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి అంటూ ధ్వజమెత్తారు. వ్యవసాయ రుణాల మాఫీ పేరుతో అధికారం చేపట్టి రైతుల్నే మోసం చేశారని విమర్శించారు. బంగారం వేలం పాటలను అడ్డుకుంటామని అన్నారు.

మరో వైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో విమానాయాన అభివృద్ధి చాలా ముఖ్యమని పౌర విమానయాన శాఖ పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. 100 రోజుల పాలనలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్ని చేయడం సాధ్యంకాదని చెప్పారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ దిశగా ఆయన అడుగులేస్తున్నారని తెలిపారు. రుణమాఫీపై టీడీపీ ప్రభుత్వం అసలేమి చేయలేదనడం సబబు కాదని అన్నారు.