వచ్చే ఎన్నికలలో ఈ ముగ్గురు ఎక్కడనుంచి పోటీ చేస్తారో..?

Thursday, April 28th, 2016, 01:26:37 PM IST


2019 ఎన్నికల కోసం అప్పుడే అన్ని పార్టీలు అప్పుడే సన్నాహాలు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం, వైకాపా, జనసేన పార్టీల మధ్య వచ్చే ఎన్నికలలో పోటీ ఉంటుంది. అయితే, కాంగ్రెస్ తరపున ఈసారి చిరుకూడా రంగంలో దిగినా ఆశ్చర్యపోనక్కరలేదు.

మూడు పార్టీలతో పాటు బీజేపికూడా బరిలోకి దిగుతుంది కాబట్టి నాలుగు పార్టీల మధ్య పోటీ ఉంటుంది. అయితే, కొత్తగా ఎన్నికలలో పోటీ చేయబోతున్న జనసేన పార్టీ చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి.. ఎన్నికల వరకు నడుస్తాయి అనడంలో సందేహం లేదు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. చిరంజీవి గతంతో తిరుపతి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వచ్చే ఎన్నికలలో బాలకృష్ణ హిందూపురం నుంచే పోటీకి దిగే అవకాశం ఉన్నది.

ప్రస్తుతం చిరంజీవి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. మరికొద్ది రోజులలో చిరు పదవీకాలం ముగుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది కాబట్టి ఈసారి ఎంపీపదవి దక్కదు. మరి చిరు కాంగ్రెస్ లోనే ఉండి పార్టీ భవిష్యత్తు కోసం పాటుబడతారో లేదంటే.. వేరే పార్టీలోకి జంప్ అవుతారో కాలమే నిర్ణయిస్తుంది.

ఇకపోతే, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నదే ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ నుంచి పవన్ రాష్ట్రంలో పర్యటించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. మొదటి విడత యాత్రకోసం 45 నియోజక వర్గాలను పవన్ ఎంచుకున్నట్టు తెలుస్తున్నది. ఈ నలబై ఐదు కూడా వెనకబడిన ప్రాంతాలే. అక్కడి సమస్యలు తెలుసుకొని.. ముందుగా అక్కడి సమస్యపై పోరాటం చేయాలని పవన్ నిర్ణయించుకున్నారు.

ఈ నలభై ఐదు నియోజక వర్గాలలో ఎక్కడి నుంచైనా పవన్ పోటీ చేస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి లేదంటే కృష్ణా జిల్లా నుంచి పవన్ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది.