రాజకీయం, హీరోయిజం ఒక్కటికాదని పవన్ ఎప్పుడో తెలుసుకున్నారు

Wednesday, May 25th, 2016, 10:50:49 AM IST


ఒక హీరోకి హీరోయిజం సినిమాల్లో మాత్రమే వర్కవుట్ అవుతుంది. అభిమానుల్ని థియేటర్లకి రప్పించడానికి, వసూళ్లు రాబట్టడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని ఆ హీరోయిజమంతా రాజకీయాల్లో పూర్తిస్థాయిలో పనిచేయదు. ఏవో తీవ్రమైన ప్రజాసమస్యలు, రాజకీయ శూన్యత ఏర్పడితే తప్ప ఒక పెద్ద హీరో ముఖ్యమంత్రి స్థానాన్ని అందుకోవడం వీలుపడదు. ఆ వాస్తవాన్నే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పూర్తిగా అవగాహనచేసుకున్నారు.

అందుకే రాష్ట్ర ప్రజలు ఓ కొత్త మార్పు కోసం ఎదురుచూస్తున్న సమయంలో పార్టీ పెట్టాడు. పార్టీ ఉంది కదా అని గుడ్డిగా ఎన్నికల్లో పోటీ చేయకుండా సమయానుకూలంగా టీడీపీ, బీజేపీలతో చేతులు కలిపి కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడాడు. అలాగే తన వద్ద తగిన రాజకీయ బలం లేదని అంచనా వేసుకుని ఇప్పటివరకూ జరిగిన ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా తెలివిగా మసులుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రం ప్రత్యేక హోదా అంశంతో వేడిగా ఉండటం, అధికార పార్టీలో వాగ్దానాల పట్ల నిలకడ లేకపోవడం, ప్రజల్లో కాస్త అసంతృప్తి వీటన్నింటినీ బేరీజు వేసుకుని ఇదే తగిన సమయం అని ఫిక్సై వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగుతున్నాడు. పవన్ చేస్తున్న ఈ ఆలోచన అసాధారణ ఫలితాలు కాకపోయినా పవన్ కు ఓ మార్యాదపూర్వకమైన ఫలితాలనే ఇస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.