బాలయ్యతో పాటు పవన్?

Wednesday, November 26th, 2014, 03:00:45 AM IST


తెలుగుదేశం పార్టీ హిందూపూర్ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు,తెలుగు చిత్రసీమ లెజెండ్ నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత, టాలివుడ్ సంచలనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకే సారి తమ అభిమానులకు కనువిందు చేయ్యబోతున్నారన్న వార్త తాజాగా టిఎఫ్ఐ వర్గాలను నిద్రపోనివ్వడం లేదు. కాగా ఇటీవల రాజకీయాల్లో బిజీగా ఉంటూనే 98వ చిత్రాన్ని పూర్తి చేస్తున్న బాలకృష్ణ తన నూరవ చిత్రం కోసం ముందస్తు ప్రణాళికలను తయారు చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంగా తనకు అపారమైన విజయాలను కట్టబెట్టినట్టి ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుకే తన వందవ చిత్ర పగ్గాలను కూడా బాలకృష్ణ అప్పజెప్పబోతున్నారని వినికిడి.

ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి, ఆ పార్టీ ప్రచారాల్లో చురుగ్గా పాల్గొని, ఏపీలో టిడిపి తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకోవడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన వంతు కృషి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పొత్తును పొడిగిస్తూ బాలయ్య వందవ చిత్రంలో పవన్ కనిపించబోతున్నారన్న వార్త తెలుగు చిత్రసీమలో కలకలం రేపుతోంది. మరి ఈ సమాచారమే గనుక నిజమైతే బాలయ్య ఫాన్స్ తో పాటు పవన్ అభిమానులకు త్వరలో పండగ వాతావరణం నెలకొంటుంది అనడంలో సందేహం లేదు.