రివ్యూ ‘రాజా’ తీన్‌మార్ : పిట్టగోడ – పర్లేదు కూర్చోడానికి సౌకర్యంగానే ఉంది !

Sunday, December 25th, 2016, 08:37:18 AM IST


తెరపై కనిపించిన వారు : విశ్వదేవ్ రాచకొండ, పునర్నవి భూపాలం

కెప్టెన్ ఆఫ్ ‘పిట్టగోడ’ : కేవీ అనుదీప్

మూల కథ :

తెలంగాణాలోని గోదావరిఖని అనే ఊరిలో ఎలాంటి పని పాట లేకుండా తిరిగుతూ పిట్టగోడ మీద కూర్చొని కాలక్షేపం చేస్తూ అందరితోటీ తిట్లు తినే ఈ బ్యాచ్ నలుగురు కుర్రాళ్ళ బ్యాచ్ స్ట్రైకర్స్ టీమ్. దీనికి టిప్పు (విశ్వదేవ్) లీడర్ గా ఉంటాడు. అందరిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలనే ఐడియాతో వీళ్ళు తమ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంటును నిర్వహించాలనుకుని, ఎంట్రీ ఫీజులు వసూలు చేసి అన్ని ఏర్పాట్లను చేస్తారు. అన్నీ పూర్తై టోర్నమెంట్ కు ముందు రోజు రాత్రి టిప్పు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. దాంతో టిప్పు, అతని ముగ్గురు స్నేహితులు కష్టాల్లో పడతారు. అసలు టిప్పు తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏమిటి ? ఎందుకు తీసుకున్నాడు ? దాని వలన టిప్పు ప్రేమకు, స్నేహానికి ఎలాంటి కష్టాలొచ్చాయి ? చివరికి ఏం జరిగింది ? అనేదే ఈ సినిమా స్టోరీ.

విజిల్ పోడు :
–> ముందుగా సినిమాలోని వాస్తవికతను దగ్గరగా ఉండే కథ రాసి దాన్ని అందంగా తెరకెక్కించిన దర్శకుడు కెవి ఆనంద్ కు, మంచి కథనాన్ని రాసిన రామ్మోహన్ కు మొదటి విజిల్ వేసుకోవచ్చు. వీరి రచనా, దర్శకత్వ ప్రతిభలతో సినిమాకు ప్రాణం పోశారు.

–> ఇక ఫస్టాఫ్ ఓపెనింగ్ దగ్గర్నుంచి ఇంటర్వెల్ వరకు, సెకండాఫ్ క్లైమాక్స్ ముందు వరకు నడిచే సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా అనవసరపు సన్నివేశాలతో విసిగించకుండా సరదాగా సాగిపోతుంటుంది. కనుక ఈ భాగాలకు రెండవ విజిల్ వేసుకోవచ్చు.

–> హీరో విశ్వదేవ్, హీరోయిన్ పునర్నవిల నటన, వాళ్ళ లవ్ ట్రాక్, ప్రాణం కమలాకర్ సంగీతం, నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీకి ముచ్చటగా మూడో విజిల్ కొట్టచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమా అంతా చాలా సహజంగా, ఆసక్తిగా నడిచి క్లైమాక్స్ కు వచ్చేసరికి చాలా చాలా రొటీన్ గా మారిపోయి ఢమ్మాల్ అనిపించింది.

–> సినిమాలోని ప్రధాన అంశాలైన ప్రేమ, స్నేహం రెండింటిలో ఏదో ఒకదాన్ని క్లైమాక్స్ లో ఎమోషన్ గా నడిపి సినిమాను మంచి ఫీల్ తో ముగించి ఉంటే బాగుండేది. కానీ దర్శకుడు అలా చేయకపోవడంతో సినిమా అంతా బాగున్నా రిజల్ట్ లో తేడా కనిపిస్తుంది.

–> ఇక ఇంతకు మించి ఇందులో వేరే లోపాలేవీ లేవు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..!

–> హీరో టిప్పుని రౌడీలు ఇరగ్గొట్టి దాదాపు సగం చంపుతారు. కానీ హీరో మాత్రం రెండు రోజులకే ఫుల్ ఫిట్నెస్ తో లేచి బయటకు రావడం చాలా విచిత్రంగానే తోస్తుంది.

చివరగా సినిమా చూసిన ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : సినిమా అంతా బాగుందిరా కానీ ఏదో లోటు కనిపిస్తోంది.
మిస్టర్ బి : అదేరా క్లైమాక్స్ ను తేల్చేశారుగా అదే అయ్యుంటుంది.
మిస్టర్ ఏ : అవును.. అది కాస్త బాగుండుంటే రిజల్ట్ ఇంకా బాగుండేది.