మోడీ నిద్రపోనివ్వడంలేదు!

Monday, November 17th, 2014, 05:01:34 PM IST


కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడు హైదరాబాద్ లో సోమవారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాను నిద్రపోవట్లేదని, మంత్రులను నిద్రపోనివ్వటంలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. అలాగే మోడీ తెల్లవారిఝామునే నిద్ర లేస్తారని ఇక అప్పటి నుండి తమకు నిద్ర ఉండడంలేదని వెంకయ్య వివరించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ప్రజల కోసం, సామాన్యుల జీవనాన్ని మెరుగుపరిచేందుకు పని చెయ్యడం జీవితంలో అన్నింటి కన్నా ఆనందం ఇచ్చే విషయమని, అందుకే తాము నిద్రలేమిని ఆస్వాదిస్తున్నామని వెంకయ్య పేర్కొన్నారు. ఇక దేశంలో ప్రతీ ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు తెరవడానికి కనీసం ఐదేళ్ళు పడుతుందని మంత్రులంటే ప్రధాని మోడీ మాత్రం ఒక్క ఏడాదిలోనే పూర్తి చెయ్యాలని గట్టిగా నిర్దేశించారని తెలిపారు. అలాగే ఇప్పటికే కేవలం 7వారాల్లో దాదాపు 7కోట్ల మంది జన్ ధన్ యోజన కింద ఖాతాలు పొందారని వెంకయ్య నాయుడు వివరించారు.