రివ్యూ ‘రాజా’ తీన్‌మార్ : ప్రేమమ్ – నాగ చైతన్య ప్రేమ ప్రయాణం బాగుంది ..!

Saturday, October 8th, 2016, 03:07:19 PM IST


తెరపై కనిపించిన వారు : నాగ చైతన్య, అనుపమ పరమేశ్వరన్, శృతిహాసన్, మడోన్నా సెబాస్టియన్

కెప్టెన్ ఆఫ్ ‘ప్రేమమ్’ : చందూ మొండేటి

మూల కథ :

మలయాళ ‘ప్రేమమ్’ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కిన చిత్రమే ‘ప్రేమమ్’. విక్రమ్(నాగ చైతన్య) అనే కుర్రాడు 16 ఏళ్ల వయసులో సుమ(అనుపమ పరమేశ్వరన్), కాలేజ్ టైం లో లెక్చరర్ సితార (శృతి హాసన్) ను, తరువాత 30 ఏళ్ల వయసులో సింధు (మడోన్నా సెబాస్టియన్) ను ప్రేమిస్తాడు. అలా ముగ్గుర్ని ప్రేమించిన విక్రమ్ చివరికి ఎవరితో సెటిలయ్యాడు. తన ప్రేమ కథల ద్వారా ఎలాంటి అనుభవాలను ఎదుర్కున్నాడు అన్నదే ఈ సినిమా..

విజిల్ పోడు :

1. వేరే భాష నుండి కథను తీసుకున్నా కూడా అందులో ఎంతో కొంత కొత్తదనంతో తన మార్క్ చూపించాలన్న తపనతో దర్శకుడు చందూ మొండేటి కథనంలో మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు చేసిన మార్పులు బాగానే కనెక్టయ్యాయి. కాబట్టి అతని ప్రయత్నానికి విజిల్ వేయొచ్చు.

2. ఇక విక్రమ్ పాత్రలో హీరో నటన చాలాబాగుంది. ముఖ్యంగా లోకం తెలియని 16 ఏళ్ల స్కూల్ కుర్రాడిగా, అగ్రెసివ్ గా ఉండే ఇంజనీరింగ్ స్టూడెంట్ గా అన్ని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన రెండవ ప్రేమ కథలో వచ్చే ఎమోషనల్ సన్నివేశంలో అతను పలికించిన హావభావాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కాబట్టి అతనికొక పెద్ద విజిల్ వెయ్యాలి.

3. సినిమాకి అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించిన కార్తీక్ ఘట్టమనేని, మంచి సంగీతం, బ్యాక్ గ్రోన్డ్ స్కోర్ ఇచ్చిన రాజేశ్ మురుగేశన్, గోపీ సుందర్ లకు, క్వాలిటీలో రాజీపడకుండా సినిమా తీసిన నిర్మాత ఎస్. నాగ వంశీ, అతిధి పాత్రలు చేసిన వెంకటేష్, నాగార్జున, హీరోయిన్లుగా నటించిన అనుపమ, మడోన్నా సెబాస్టియన్ వంటి వారందరికీ కలిపి ఒక విజిల్ వెయ్యొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

1. సినిమా మొత్తంలో రెండవ ప్రేమ కథలో లెక్చరర్ గా నటించిన శృతి హాసన్ ఆ ప్రలో అంతగా ఇమడలేదు. ఆమె ఇమేజ్ పెద్దదవడమో లేకపోతే ఆ పాత్ర ఆమెకి సూట్ కాకపోవడం వల్లనో ఆమె పాత్రలో సహజత్వం లోపించింది.

2. ఇక అదే లవ్ ట్రాక్ లో సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు కాస్త బోర్ కొట్టించాయి. ఇవి తప్ప ఇందులో వేరే ఢమ్మాల్ పాయింట్స్ ఏమీ లేదు.

దావుడా – ఈ సిత్రాలు చూశారు ..!!

–> ఒక లెక్చరర్ ఎలాంటి బలమైన కారణం లేకుండా తన స్టూడెంట్ తో లవ్ లో పడిపోవడమనేది కాస్త చిత్రంగానే ఉంటుందని.

చివరగా సినిమా చూసిన ఇద్దరు మిత్రులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : సినిమా చాలా బాగుందిరా. అసలు నాగ చైతన్య అయితే యాక్షన్ చింపేశాడు.

మిస్టర్ బి : చైతు బాగానే చేశాడు. కానీ మొత్తంగా చూస్తే సినిమా ఎందుకో ఒరిజినల్ వెర్షన్ అంత గొప్పగా లేదురా.

మిస్టర్ ఏ : ఒరిజినల్ వెర్షన్ లానే ఉండాలంటే అదే చూడొచ్చుగా.. ఈ సినిమాకి రావడం ఎందుకు. కాసేపు ఆ కంపారిజన్ ఆపేసి కొత్త సినిమాని చూసినట్టు చూడు.

మిస్టర్ బి : అవును నిజమే. పోలిక పెట్టకుండా చూస్తే సినిమా బాగుంది.