ఈ పొలిటికల్ హీరోలకి ఏమైంది.. అసలు నోరు మెదపరేంటి..?

Thursday, June 16th, 2016, 08:56:00 AM IST


పాలిటిక్స్ అంటే అంత ఈజీ కాదు.. దూల తీరిపోద్ది.. అనే వాస్తవం మన పొలిటికల్ హీరోలు పవన్ కళ్యాణ్, బాలకృష్ణలకి బాగానే అనుభవంలోకి వస్తోంది. ఒకవైపు జీవితాన్నిచ్చిన సినిమాలు మరో వైపు ప్రమాణం చేసిన రాజకీయాలతో వీళ్ళు సతమతమైపోతున్నారు. పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉన్నవారే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకి తలకిందులైపోతుంటే అప్పుడప్పుడు బయటకొచ్చి ఓ మాట చెప్పి వెళ్ళిపోతున్న వీళ్ళ పరిస్థితి ఇక చెప్పనవసరం లేదు. ఎందుకంటే వీరిద్దరూ ఆషామాషీ వ్యక్తులు కాదు. సినిమాల్లో పీక్స్ అందుకుని గొప్ప ప్రజాదరణతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తులు. ప్రస్తుతం సినిమా రంగంలో వీళ్ళ పొజిషన్ గమనిస్తే వీళ్ళ చివరి సినిమాలు అంతగా ఆడలేదు. కాబట్టి ఖచ్చితంగా హిట్టుకోట్టాలి. అందుకు పవన్ ఎస్ జే సూర్యతో సినిమా చేస్తుంటే, బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి చేస్తూ చాలా బిజీగా ఉన్నారు.

ఇక రాజకీయాల్లోకి వస్తే పోటీ చేయకపోయినా రాష్ట్రంలో మూడో ప్రత్యాన్మాయంగా చెప్పుకోదగ్గ స్టామినా ఉన్న పార్టీకి అధ్యక్షుడైన పవన్ ప్రస్తుత ప్రధాన సమస్య కాపు సమస్యపై తన అభిప్రాయాన్ని ఇంత వరకూ చెప్పలేదు. బాలయ్య చూస్తే అధికార పార్టీకి చెందినప్పటికీ తమ అధినేతపై వస్తున్న ఆరోపణలను కనీసం ఖండించను కూడా లేదు. దీంతో జనాలు వీళ్ళు రెండు పడవల మీదా కాళ్ళు పెట్టి నిల్చున్నారు. మొదటి పడవ సినిమాకి న్యాయం చేస్తున్నారు బాగానే ఉంది. మరి పాలిటిక్స్ మాటేమిటి? ఏమీ మాట్లాడరా? అంటే ఈ పడవను ముంచేసినట్టేనా? అని అనుమానపడుతున్నారు. సో ప్రజల అభిప్రాయాన్ని మార్చాలంటే మన పొలిటికల్ హీరోలు పాలిటిక్సుకు కాస్త టైమ్ ఇచ్చి సమస్యపై నోరు మెదపక తప్పదు.