మదమెక్కిన మగతనం.. ఎనిమిదేండ్ల బాలికపై లైంగికదాడి

Friday, April 13th, 2018, 01:54:53 PM IST

జమ్ముకశ్మీర్‌లోని కతువాలో ఎనిమిదేండ్ల బాలికపై వారం రోజులపాటు లైంగికదాడికి పాల్పడి అనంతరం దారుణంగా హత్య చేసిన ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది నమ్మశక్యం కానటువంటి క్రూరత్వం.దుండగులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. అటువంటి వారిని కాపాడటానికి ప్రయత్నాలు జరుగడం నాకు విస్మయం కలిగిస్తుంది. దుండగులను శిక్షించకుండా వదిలిపెట్టవద్దు అని ట్వీట్ చేశారు. చిన్నారిపై దాడి మానవత్వంపై దాడి వంటిదని పేర్కొన్నారు. కతువాలో మైనారిటీలుగా ఉన్న బఖర్‌వాల్ సంచారజాతివారిని వెళ్లగొట్టేందుకు కొందరు అక్కడి ఆలయ సంరక్షుడి ఆధ్వర్యంలో ఆసిఫా(8)ను అపహరించి ఓ గ్రామంలో వారం రోజులపాటు నిర్బంధించి, మత్తుమందు ఇచ్చి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు.

చివరికి ఆ బాలికను గొంతు పిసికి చంపి, ప్రాణం పోయిందని నిర్ధారించుకోవడానికి పెద్ద బండరాయితో రెండుసార్లు బాదారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిచడంతో దర్యాప్తు బృందం సిట్ ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో ఇద్దరు పోలీసు అధికారులు, ఒక హెడ్‌కానిస్టేబుల్ ఉన్నారు. సాక్ష్యాలను నాశనం చేయడంతో పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కతువాలో ఎనిమిదేండ్ల చిన్నారిపై జరిగిన సామూహిక లైంగికదాడితో మనం మనుష్యులుగా విఫలమయ్యాయని విదేశీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి వీకే సింగ్ అన్నారు.