ముద్రగడ పరిస్థితి విషమం.. పవన్ నిర్ణయం అదేనా..!

Monday, June 20th, 2016, 08:43:51 AM IST


కాపు నేత ముద్రగడ పద్మనాభం పరిస్థితి రోజురోజుకూ విషమిస్తోంది. రాజమహేంద్రవరంలో ఆయన చేస్తున్న ఆమరణ దీక్ష 11వ రోజుకు చేరుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు నాయకులు ఆందోళనలో ఉన్నారు. ఏ క్షణానయినా ఆయన పరిస్థితి విషమించవచ్చనే వదంతులు కూడా వినిపిస్తున్నాయి. ముద్రగడ కూడా వైద్యానికి నిరాకరిస్తూ బంధువుల వద్ద తన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం మాత్రం అరెస్ట్ చేసిన వారిలో ముగ్గురిని ఇంకా విడుదల చేయలేదు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఉన్న కాపు నేతలు చిరు, దాసరి సహా అందరూ స్పందించి తమ నిర్ణయాన్ని స్పష్టం చేసి ముద్రగడకు తమ మద్దత్తు ప్రకటించిన మరో కీలకనేతైన పవన్ మాత్రం ఇప్పటి వరకూ తన నిర్ణయం చెప్పలేదు. అటు కాపులను కాదంటే బాబుకు సపోర్ట్ చేస్తున్నారన్న ఆరోపణ, చేస్తే తమ వర్గం కనుక చేశారన్న అపవాదు పడుతుంది కనుక పవన్ ఎటూ కాకుండా పరిస్థితి కాస్త చక్కబడే వరకూ తటస్థంగా ఉంటే మంచిదనే నిర్ణయం తీసుకున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.