షా వ్యూహం బెడిసికొట్టడానికి కారణం..?

Wednesday, February 11th, 2015, 12:41:13 PM IST


అమిత్ షా… సార్వత్రిక ఎన్నికల తరువాత దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన పేరు. వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరుపొందిన షా వ్యూహం ఢిల్లీ దగ్గరికి వచ్చేసరికి దారుణంగా విఫలం అయింది. ఇందుకు గల కారణాలు ఎన్నో ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉన్నది. ఈ వ్యతిరేకతను బీజేపి వైపు మళ్ళించుకోవడంలో షా నమో మంత్రాన్ని ప్రయోగించారు. ఇది బాగా పనిచేసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో 70 లోక్ సభ స్థానాలకు గాను 63స్థానాలను బీజేపి కైవసం చేసుకున్నది. ఉత్తరప్రదేశ్ లో బీజేపి గెలుపుకోసం వ్యూహాలు రచించిన వ్యక్తీ షా అని మనందరికీ తెలుసు. ఉత్తరప్రదేశ్ దేశంలో అతి ముఖ్యమైన రాష్ట్రం. అత్యధిక పార్లమెంట్ స్థానాలు కలిగిన రాష్ట్రం కూడా అదే. అక్కడ నుంచే అమిత్ షా తన వ్యూహాలు రచించారు. ఇందులో భాగంగానే ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నియోజక వర్గం నుంచి మోడీని బరిలోకి దించారు. కాంగ్రెస్ వ్యతిరేకత, మోడీ మాట తీరు దేశాన్ని బాగా ప్రభావితం చేసింది. మూడు దశాబ్దాల తరువాత ఒక పార్టీకి దేశ ప్రజలు ఓటేసి గెలిపించారు. అయితే, ఇది, నమో మంత్రమో, షా వ్యూహమో కాదు. ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు. స్థిరమైన పాలనను కోరుకున్నారు. బహుశా అందుకే బీజేపిని అఖండ మెజారిటీతో గెలిపించారు.

స్థిరమైన పాలనను అందించాలంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పూర్తీ మెజారిటీ ఇవ్వొచ్చుకదా అనే సందేహం రాకమానదు. యూపిఏ పాలనలో ఎన్నో అవకతవకలు జరిగాయి. కుంభకోణాలు జరిగాయి. దీంతో ఆర్ధికపరిస్థితి కుంటుపడింది. ఇక, మోడీ విషయానికి వస్తే, మోడీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా గుజరాత్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేశారు. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేశారు. పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించుకోవడంలో తనదైన ముద్రను వేశారు మోడీ. గుజరాత్ అభివృద్ధి గురించి దేశంలోని ప్రజలలోకి తీసుకెళ్ళడంతో సక్సెస్ అయింది బీజేపి. ఫలితంగా బీజేపి అభివృద్ధి మత్రంతో దేశంలో అధికారంలోకి వచ్చింది.

అయితే, దేశం వేరు… రాష్ట్రాలు వేరు. దేశంలో ప్రజలు స్థిరమైన పాలనా, ఆర్ధికపరమైన అభివృద్ధిని కోరుకున్నారు. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే… ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను అర్ధం చేసుకోవడంలో బీజేపి హర్యానా, ఝార్ఖండ్ రాష్ట్రాలలో సఫలం అయింది కాబట్టి పూర్తీ మెజారిటితో విజయం సాధించింది. ఇక, మహారాష్ట్ర విషయానికి వస్తే… కాంగ్రెస్ వ్యతిరేకత బీజేపికి వరం అయింది. ఇక, 25 సంవత్సరాలుగా కలిసి పనిచేసిన శివసేన, బీజేపిలు మహారాష్ట్రలో విడిపోయాయి. దీంతో పార్టీ అధికారం చేజిక్కించుకునేందుకు అవసరమైన మెజారిటీని ఏ పార్టీ సాధించలేదు. ఇకపొతే, ఆర్ఎస్ఎస్, షా రంగంలోకి దిగి ఎలాగో తంటాలు పడి విడిపోయిన రెండు పార్టీలను ఒకటి చేయడంతో మహారాష్ట్రలో బీజేపి అధికారంలోకి రాగలిగింది.

అనంతరం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. 65%మంది అక్కడ ముస్లిం ఓటర్లే ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ లో మోడీ నాలుగు సార్లు పర్యటించారు. బహిరంగ సభలలో ప్రసంగించారు. ఫలితంగా 28 స్థానాల్లో విజయం సాధించి రెండో పెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ఇంతవరకు ఏ పార్టీ కూడా అక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకోలేదు. ఢిల్లీ దగ్గరికి వచ్చే సరికి, బీజేపి మ్యానిఫెస్టోను కాకుండా విజన్ డాక్యుమెంటరీని విడుదల చేయడం, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా అన్నా హజారే స్కూల్ నుంచి వచ్చిన కిరణ్ బేడిని ప్రకటించడం బీజేపి చేసిన తప్పిదాలని చెప్పవచ్చు. ఇక, ఆప్ ఎన్నికలు తేదీలను ప్రకటించక ముందునుంచే… క్షేత్రస్థాయిలో బలోపేతం కావడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నది. హైటెక్ పాలన కంటే, పేదవాడికి కావలసిన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ముఖ్యంగా, దేశరాజధానిలో మహిళలకు రక్షణ అన్నది కరువైపోయింది. దీంతో దీనిపై ఆప్ దృష్టిపెడతామని కూడా చెప్పింది.

ఇక, ఎన్డీఏ కూటమి చెందిన నాయకులు హిందుత్వవాదంతో ప్రచారం చేయడం ఇతర మతాల వారిని కలవరానికి గురిచేసింది. ఇది ఆప్ కు కలిసొచ్చిన అంశం అని చెప్పవచ్చు. అంతేకాకుండా, ఎన్నికలకు కొన్నిరోజుల ముందు క్రైస్తవ చర్చీలపై దాడులు జరగడంతో క్రైస్తవ సోదరులు అభద్రతా భావానికి గురయ్యారు. వీరుకూడా ఆప్ వైపే చూసినట్టు తెలుస్తున్నది. ముస్లింలు సైతం ఆప్ కె ఓటు వేయాలని బహిరంగంగా చెప్పడం ఇందుకు ఒక నిదర్శనం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అన్ని మతాల వారిని గౌరవించాలి. అన్ని మతాల వారికీ అవకాశాలు ఇవ్వాలి. బీజేపి ఇప్పటికైనా హిందుత్వవాదంతో కాకుండా… అందరినీ కలుపుకొని పోయినట్టైతే తరువాత జరిగే రాష్ట్రాల ఎన్నికలలో అయిన విజయం సాధించవచ్చు.