12 వేళ్లతో పుట్టాడని నరబలికి ప్లాన్!

Monday, September 3rd, 2018, 12:09:43 PM IST

దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇంకా చాలా మంది ప్రజలు మూఢ నమ్మకాల్లోనే ఉన్నారు. గుడ్డిగా మాయమాటలు నమ్మి తాంత్రిక పూజలు అంటూ అవివేకంతో జీవిస్తున్నారు. రీసెంట్ గా ఒక బాలుడిని బలి ఇవ్వడానికి కొందరు ప్రయత్నం చేయడం లక్నో లో అందరిని షాక్ కి గురి చేసింది. అతను చేతులకు, కాళ్లకు 12 వేళ్లతో జన్మించడమే అపోహలకు కారణమైంది. అతని బంధువులు గత కొంత కాలంగా బలి ఇవ్వాలని అలా చేస్తే సంపద చేకూరుతుందని తల్లిదండ్రులకు చెబుతున్నారట.

అసలు వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాకు చెందిన ఒక బాలుడు చేతులకు, కాళ్లకు 12 వేళ్లతో జన్మించడం ఆ ప్రాంతంలో అపోహలను కలిగించింది. బాలుడి కుటుంబ సభ్యులు నరబలి ఇవ్వాలని మంచి సంపద కలుగుతుందని తాంత్రికుడు చెప్పినట్లు బాలుడి తల్లి దండ్రులకు తెలిసింది. దీంతో కొడుకుని బయటకు వెళ్లనివ్వకుండా అందరూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. స్కూలుకు కూడా పంపించడం లేదు. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో బాలుడి చదువు ఆగిపోకూడదని తాము పూర్తి బాధ్యత తీసుకొని పిల్లాడ్ని చదివిస్తామని బారాబంకి పోలీసులు తెలిపారు. ఇక నర బలి అని అనుమానాలు రేపిన వారిపై చర్యలు తీసుకొని ఘటనకు ముగింపు పలుకుతామని పోలీసులు తెలియజేశారు.