‘రివ్యూ రాజా’ తీన్‌మార్ : రెమో – ఈ ప్రేమికుడు తెలుగు వాళ్లకు కనెక్టవ్వలేదు !

Friday, November 25th, 2016, 01:13:31 PM IST


తెరపై కనిపించిన వారు : శివకార్తికేయన్, కీర్తి సురేష్
కెప్టెన్ ఆఫ్ ‘రెమో’ : బక్కియరాజ్ కన్నన్

మూల కథ :

సినిమాలో హీరో కావాలనే లక్ష్యంతో ప్రయత్నాలు చేసే కుర్రవాడే ఎస్కె (శివకార్తికేయన్). ఒకరోజు అతను కావ్య (కీర్తి సురేష్) అనే అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. కానీ ఆమెకు అప్పటికే నిశ్చితార్థం అయిపోయి ఉంటుంది. కానీ ఎస్కె మాత్రం ఎలాగైనా ఆ అమ్మాయి తనను ప్రేమించేలా చేయాలని లేడీ గెటప్ వేసుకుని కావ్య డాక్టర్ గా పని చేసే హాస్పిటల్లో నర్స్ గా చేరతాడు. అలా ఎస్కె కావ్యకు ఎలా దగ్గరయ్యాడు ? ఎలా ఆమె తనను ప్రేమించేలా చేశాడు ? చివరకు ఆమెను దక్కించుకున్నాడా? లేదా అనేదే ఈ సినిమా కథ.

విజిల్ పోడు :

–> ఈ సినిమాలో ముందుగా విజిల్ కొట్టాల్సింది హీరో శివకార్తికేయన్ కు లేడీ గెటప్ వేసిన మేకప్ టీమ్ కి. ఎవరైనా హీరో లేడీ గెటప్ వేస్తే ఎక్కువసేపు చూడలేం. కానీ శివకార్తికేయన్ లేడీ గెటప్ వేస్తే మాత్రం ఇంకా కాసేపు చూడాలనిపించింది. అంత గొప్ప పనితనం చూపిన మేకప్ టీమ్ కి విజిల్ వేసుకోవచ్చు.

–> ఇక దర్శకుడు బక్కియరాజ్ కన్నన్ కూడా లేడీ గెటప్ లో ఉన్న హీరోని అవసరమైనంత వరకు మాత్రమే చూపుతూ హీరో హీరోయిన్ల మధ్య మంచి రొమాన్స్ పండేలా చేశాడు. కాబట్టి అతనికి ఈ రెండు విషయాల్లో ఒక విజిల్ వేసుకోవచ్చు.

–> చివరగా లేడీ గెటప్ లో ఇరగదీసిన శివకార్తికేయన్, స్క్రీన్ ప్రెజెన్స్ తో అలరించిన కీర్తి సురేష్ కు, రొమాంటిక్ సన్నివేశాల్లో వారి కెమిస్ట్రీకి చివరి చివరి విజిల్ వెయ్యొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> ఫస్టాఫ్ మొదలైన కాసేపటికథనం నెమ్మదించి సినిమా బోరింగ్ గా మారింది. అక్కడక్కడా వచ్చే కామెడీ తప్ప మిగతా ఏ సన్నివేశాలూ అలరించలేదు.

–> దర్శకుడు కన్నన్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీకి పాతదే అయినా లేడీ గెటప్ కాన్సెప్ట్ వాడారు కానీ ఎక్కడా పెద్దగా ఎమోషన్, సెంటిమెంట్ లాంటివి పండించలేకపోయాడు.

–> ఇందులో చివరి, పెద్ద మైనస్ పాయింట్ ఏమిటంటే సినిమాలో ఒక్క మాటలు లేని రొమాన్స్ తప్ప మరే అంశం కూడా తెలుగు వారికి కనెక్టయ్యే విధంగా లేదు.

దావుడా.. ఈ సిత్రాలు చూశారూ ..!!

–> సినిమా చివర్లో హీరోయిన్ హీరోని వదిలి వెళ్ళిపోగానే హీరో మళ్ళీ ముసలాడి వేషంలో ఆమెకు దగ్గరవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు కూడా హీరోయిన్ హీరోని గుర్తుపట్టదు. అది కాస్త వింతగానే ఉంటుంది.

–> అలాగే పలు సందర్భాల్లో హీరోయిన్ నర్స్ వేషంలో ఉన్నది హీరోనే అని గుర్తుపట్టే ఛాన్స్ వచ్చినా గుర్తు పట్టలేదు. అది కూడా విడ్డూరంగానే ఉంది.

ఇక సినిమా చూసిన ఇద్దరు మిత్రుల సంభాషణ ఇలా కొనసాగింది..

మిస్టర్ ఏ : ఏరా సినిమా ఎలా ఉంది ?
మిస్టర్ బి : ముందు నువ్వు చెప్పు.
మిస్టర్ ఏ : నాకైతే రొమాన్స్ బాగుంది కానీ ఎక్కడా కనెక్టవ్వలేదు.
మిస్టర్ బి : నాది కూడా సేమ్ ఫీలింగ్.