మళ్ళీ పరువు హత్యా…? మంచిర్యాల లో దారుణం

Sunday, December 23rd, 2018, 05:06:21 PM IST

తల్లి పిల్లల్ని కడుపున మోస్తే, తండ్రి ఆ పిల్లలని గుండెల్లో పెట్టుకొని మోస్తాడు అని చెప్తుంటారు. కానీ అలాంటి తండ్రై తన కన్నబిడ్డ పాలిట మృత్యువు అయ్యాడు. కడుపున మోయకపోయినా బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడాల్సినవాడు, కన్నబిడ్డ పాలిట కాల యముడయ్యాడు. తనకి ఇష్టం లేకపోయినా కూడా తన కూతురు వేరే కులం వాడిని పెక్కి చేసుకుందన్న కోపంతో కన్న కూతురునే కడతేర్చిన సంఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగుకు చెందిన అనురాధ, లక్ష్మణ్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ గురించి పెద్దలకు చెప్పి వివాహం చేసుకోవాలనుకున్నారు. ఎవరు వారి పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో, ఈ నెల 3న జంట పెద్దలను ఎదిరించి హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. కులం తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుందని అనురాధపై పగ పెంచుకున్న అనురాధ తల్లితండ్రులు కక్ష పెంచుకున్నారు.

అనురాధకు మాయ మాటలు చెప్పి ఆమె తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకెళ్లారు. రాత్రంతా అనురాధ తండ్రి సత్తయ్య, సోదరుడు మహేష్ తనని చితకబాదారు. ఇరుగుపొరుగు వారు చెప్పిన కూడా వినకుండా బాగా కొట్టారు. ఆ దెబ్బలు తాకలేక పాపం ఆమె చనిపోగా.. ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి ఊరి శివారులోని పొలాల్లో దహనం చేశారు. అనురాధ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు లక్ష్మణ్ తరపు వారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. అనురాధ కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించడంతో చేసిన నేరాన్ని ఒప్పుకున్నారట. కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకోని దర్యాప్తు ప్రారంభించారు.